Scorpion Soup In China | తేలును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది అక్కడ ఏకంగా తేలుతో సూప్ తయారు చేసుకుని లొట్టలేసుకుంటూ మరీ తాగేస్తారట. అయ్యయ్యో.. వారికి చికెన్, మటన్, చేపలు దొరకావా.. మరీ తేళ్లను తినేస్తున్నారనేగా మీరు అనుకుంటున్నారు. అవి కూడా తింటారు. అయితే, తేలుతో సూప్ అనేది వారికి ప్రత్యేకమైన వంటకం. అది అన్ని రెస్టారెంట్లలో దొరకదు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే దాన్ని తయారు చేస్తారట. కానీ, తేలులో విషం ఉంటుంది కదా. తింటే చచ్చిపోతారేమో అనేగా మీ సందేహం. అయితే, అదే ఆ వంటకం ప్రత్యేకత. 


తేళ్లను ఎలా పడితే అలా వండేసి తినేయలేరు. తేళ్ల తోకలో బోలెడంత విషం ఉంటుంది. అదంతా తేలు తోక చివర ఉండే ముల్లులో నిక్షిప్తమై ఉంటుంది. అయితే, తేలు దాన్ని కేవలం తన ఆత్మరక్షణ కోసమే ఉపయోగిస్తుంది. అందుకే తేలు కరిస్తే వెంటనే చికిత్స పొందాలి. ఇక తేలు సూప్ విషయానికి వస్తే.. ఈ తేలు సూప్‌ను ఎక్కువగా చైనాలోని గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా తాగుతారు. ఇంకో దరిద్రం ఏమిటంటే.. ఆ సూప్‌లో పాములు, పంది మాంసం ముక్కలను కూడా వేస్తారు. అందుకే, దానికి ప్రపంచంలోనే అతి భయానక వంటకం పేరు వచ్చింది. 


అరాక్నిడ్‌లు, కీటకాలు చైనీస్ వంటకాల్లో ఎప్పటి నుంచో భాగంగా ఉన్నాయి. వాటిలో పోషక విలువలు ఎక్కువనేది వారి నమ్మకం. ఉత్తర చైనాలో వివిధ జంతువుల మాంసంతోపాటు దోరగా వేయించిన తేళ్లను మార్కెట్లో స్నాక్స్‌లా అమ్మేస్తుంటారు. ‘స్కార్పియన్(తేలు) సూప్’ గ్వాంగ్‌డాంగ్‌ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. అయితే, అవి ఆ ప్రావిన్స్‌లోని అన్ని రెస్టారెంట్ మెనులో దొరకవు. తేలులోని విషాన్ని తొలగించిన తర్వాత ఈ సూప్‌ను తయారు చేస్తారు. ఇలా చేయడం కేవలం శిక్షణ పొందిన చెఫ్‌కు మాత్రమే సాధ్యం. అందుకే, దీన్ని ప్రత్యేకమైన వంటకంగా పేర్కొంటారు. ఈ సూప్ తయారు చేసే చెఫ్‌లకు కూడా అక్కడ ఎంతో డిమాండ్ ఉంటుంది. 


ఈ సూప్‌లో తేలుతోపాటు పంది, పాముల మాంసం ముక్కలను వేస్తారు. రుచి, సువాసనల కోసం వెల్లులి, అల్లం, సుగంధ ద్రవ్యాలను వేస్తారు. మరింత రుచి కోసం కొందరు కూరగాయల ముక్కలు కూడా వేస్తుంటారు. చాలామంది తేలు తోకను కట్ చేయడాన్ని ఇష్టపడరు. అందుకే, తోక ఉండగానే విషాన్ని తొలగించే విధానాలను అనుసరిస్తారు. ముందుగా తేలును బాగా నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత నూనెలో దోరగా వేయిస్తారు. ఆ తర్వాత పాము, పంది మాంసం ముక్కల్లో వేసి దాదాపు మూడు గంటల సేపు ఉడికిస్తారు. ఆ తర్వాత మరికొన్ని మసాలాలు కలిపుతారు. అంతే, Scorpion Soup సిద్ధం. గబ్బిలాల సూప్ తరహాలోనే దీన్ని కూడా చాలామంది అసహ్యకరమైన ఆహారం అని అంటారు. అది తెలిసి కూడా చాలామంది దీన్ని ఆర్డర్ చేసుకుని తింటారు. 


Also Read: మిలింద్ సోమన్‌ను చూశావా బేబమ్మా? ‘జపనీస్ ఫారెస్ట్ బాత్‌’తో ముసలోడే కావట్లేదట, ఇంతకీ ఏమిటదీ?


ఎందుకు తింటారు?: తేళ్ల సూప్‌ను అసహ్యకరమైన ఆహారంగా పరిగణించినా.. ప్రజలు ప్రత్యేకంగా ఆర్డర్ చేసుకుని మరీ తినడానికి గల కారణం.. అందులోని ఆరోగ్య ప్రయోజనాలే. తేలులో విషం మాత్రమే కాదట, మన శరీరానికి మేలు చేసే ఔషద గుణాలు కూడా ఉంటాయట. అయితే, ఈ విషయాన్ని ఇప్పటివరకు ఏ అధ్యయనం, పరిశోధనలు గానీ, వైద్యులు గానీ స్పష్టం చేయలేదు. తేలు ఎప్పటికీ మనిషికి హానికరమైన జంతువే. ముఖ్యంగా అందులోని విషం మన శరీరంలోకి అస్సలు వెళ్లకూడదు. అయినా సరే అక్కడి ప్రజలు రిస్క్ చేసి మరీ తీసుకుంటున్నారు. చైనీస్ సాంప్రదాయ ఔషధం ప్రకారం.. పాము, తేళ్లతో తయారు చేసే    స్కార్పియన్ సూప్ రుమాటిజం(కీళ్లు లేదా జాయింట్స్ సంబంధిత వ్యాధులు), అధిక రక్తపోటు, మూర్ఛ, చర్మ వ్యాధులను నయం చేస్తాయట. చాలా రెస్టారెంట్లు వేసవి రోజున శరీరానికి చలువ చేసేందుకు ఈ సూప్‌ను సిఫార్సు చేస్తారట. మీరు ఎప్పుడైనా చైనా వెళ్తే.. తప్పకుండా ఏం తింటున్నారో తెలుసుకోండి. 


తేళ్లతో సూప్ తయారీని ఈ వీడియోలో చూడండి: