చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో, తలపతి విజయ్ సైతం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే విజయ్ ఫొటోలు తీయడానికి మీడియా గుంపులుగా చేరడంతో అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది.
ఈ విషయాన్ని గమనించిన విజయ్ తనవల్ల జరిగిన అసౌక్యరానికి చేతులు జోడిస్తూ క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ విజయ్ సింపుల్ గా ఉండడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. క్యాంపైన్ చేసిన సమయంలో తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అని రాసి ఉన్న ఫ్లాగ్ ను వినియోగించారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ పర్మిషన్ ఇవ్వడం వలనే ఆయన పేరుని వాడుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితం విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ 'ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఓ పొలిటికల్ పార్టీని మొదలుపెట్టారు. దీనికి జనరల్ సెక్రటరీగా చంద్రశేఖర్, ట్రెజరర్ గా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ పేర్లను అనౌన్స్ చేశారు. ఈ విషయంలో విజయ్.. తన తల్లితండ్రులపై కేసు పెట్టారు.
తన అనుమతి లేకుండా వారు మొదలుపెట్టిన రాజకీయ పార్టీకి తన పేరు పెట్టారని కేసు ఫైల్ చేశారు విజయ్. దీంతో విజయ్ తండ్రి ఆ పార్టీను రద్దు చేయాల్సి వచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ 'బీస్ట్' అనే సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.