" సన్నాఫ్ ఇండియా "  గత వారం రోజుల నుంచి ఆన్‌లైన్‌లో ఎక్కువగా ట్రెండ్ అయిన సినిమా పేరు. పాజిటివో.. నెగెటివో అంతగా ట్రెండయితే ఆ సినిమాకు కాస్తంత  క్రేజ్ ఉన్నట్లే లెక్క. కానీ విచిత్రంగా ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ భిన్నమైనది. అది కలెక్షన్లు పెరగడానికి ఏ మాత్రం సహకరించకపోగా ఆ సినిమాకు వెళ్లే వారిని " బుద్దిలేని వారిగా" పరిగణించేలా సాగింది. ఫలితంగా సన్నాఫ్ ఇండియా ( Son Of India )డిజాస్టర్ అయింది. కనీసం పోస్టర్ల ఖర్చులు కాదు కదా ధియేటర్లకు ఎదురు రెంట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహన్‌బాబు కెరీర్‌లో ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఎందుకిలాంటి పరిస్థితి వచ్చింది ? ఇది ట్రోలర్స్ సాధించిన విజయమా ? మోహన్ బాబు స్వయంకృతమా ?


"అతి" ప్రకటనలతో  సినిమాపై ఆసక్తి చంపేసిన మంచు ఫ్యామిలీ !


మంచు ఫ్యామిలీ ( Manchu Family ) అంటే ఓవరాక్షన్‌కు కేరాఫ్ అనే అభిప్రాయం సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోయిన తర్వాత ఆడియన్స్‌లోకి బలంగా వెళ్లిపోయింది. సన్నాఫ్ ఇండియా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మంచు ఫ్యామిలీ చేసిన స్కిట్లు ఓవర్ అయ్యాయి. మోహన్ బాబు కూడా లెక్కకు మిక్కిలిగా ఇంటర్యూలు ఇచ్చారు. సినిమా గురించి గొప్పగా చెప్పారు. ఓ పాట తీయడానికి గ్రాఫిక్స్‌కు రూ. రెండు కోట్లు అయిందని చెప్పుకున్నారు. ఆ పాటను ప్రోమోలుగా కూడా రిలీజ్ చేశారు.  కానీ ఆ గ్రాఫిక్స్ చూసిన వారు మాత్రం నోరెళ్లబెట్టారు. ఇరవైళ్ల కిందట సినిమాల్లో గ్రాఫిక్స్ ఎలా ఉండేవో అలా ఉన్నాయి. ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సినిమాపై ఎంతో కొంత ఉన్న ఆసక్తి ఆ గ్రాఫిక్స్‌తోనే పోయింది. ఇక సినిమానూ అంతే నాసిరకంగా ఉంది. డూపుల్ని పెట్టుకుని .. వాయిసోవర్లతో సినిమాను నడిపించారు. కనీసం షార్ట్ ఫిల్మ్ రేంజ్‌లోనూ నిర్మాణ విలువలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. దానికి తగ్గట్లే ఫలితమూ వచ్చింది.


వ్యక్తిగత ప్రవర్తనతోనూ ప్రేక్షకులకు దూరం !


సినిమా ఇండస్ట్రీలో ( Film Industry  ) అంతర్గతంగా ఏం జరుగుతుందో ఒకప్పుడు బయటకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. ఎప్పుడు ఏం జరిగినా మొత్తం తెలిసిపోతోంది. అది వారి సినిమా రంగ ఇమేజే కాదు వ్యక్తిగత ఇమేజ్‌పైనా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీ చేసిన రాజకీయాల వల్ల అందరు హీరోల అభిమానులూ దూరమయ్యారు.  ఈ సారి అందరూ కలిసి ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. సొంతంగా ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది.  ఇటీవలి కాలంలో వారు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలూ తీయలేదు. తీసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. మోహన్‌బాబు సినిమాలే కాదు.. వారసుల సినిమాలూ ఆడలేదు. దీంతో టాలీవుడ్ ( Tolluwood ) మార్కెట్‌లో పరపతి కోల్పోయారు. సన్నాఫ్ ఇండియాతో అతి మరింత అథ:పాతాళానికి చేరింది.


ఓటీటీ మార్కెట్‌లోనూ నమ్మకం కోల్పోయిన ఫలితం !


నిజానికి ఓటీటీ ( OTT ) కోసం సినిమా అని మోహన్ బాబు చెబుతూ వచ్చారు. అది నిజమే. కానీ ఓటీటీలో ఎవరూ తీసుకోలేదు. అందుకే ఏం చేయాలో తెలియక రిస్క్ తీసుకుని ధియేటర్లలో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఎందుకు తీసుకోలేదంటే ... మోసగాళ్లు అనే సినిమాతో మంచు విష్ణు మొత్తంగా ఓటీటీ సంస్థను అడ్డంగా మోసగించారని అందుకే మంచు జోలికి ఓటీటీ సంస్థలు పోవడానికి సిద్ధపడలేదన్న ప్రచారం ఉంది. అది నిజమో కాదో స్పష్టత లేకపోయినా ఓటీటీ సంస్థల ప్రతినిధులు సన్నాఫ్ ఇండియాను ముందుగానే చూసి ఉన్నా ఖచ్చితంగా కొనుగోలు చేసేవారు కాదు. ఎందుకంటే చిన్న చిన్న వెబ్ సిరీస్‌లు అత్యున్నత ప్రమాణాలతో వస్తున్న కాలం ఇది. అది చీప్‌గా తీసిన సినిమాను వారు కొనుగోలు చేసే అవకాశం లేదు.


రాజకీయ అడుగులూ కూడా దెబ్బకొట్టాయి.. !


మోహన్ బాబు ఫ్యామిలీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. కానీ అది వైఎస్ఆర్‌సీపీ కండువా కప్పించుకున్నంత వరకే. గత ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మోహన్ బాబు విద్యార్థులతో కలిసి చేసిన ఆందోళన తర్వాత టీడీపీ మొత్తం వ్యతిరేకం అయింది. అదే స్థాయిలో ఆయన చేరిన పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఆయనను  ఓన్ చేసుకోలేకపోయింది. ఫలితంగా  రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. ఆయన సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయడంలో రెండు పార్టీల కార్యకర్తలూ పోటీ పడ్డారంటే   మోహన్ బాబు స్ట్రాటజీ ఎంత దారుణంగా ఫెయిలయిందో అర్థం చేసుకోవచ్చు.


టాలీవుడ్‌లో ఇక మంచు ఫ్యామిలీ ఫేడవుట్ అయినట్లేనా ?


కాలానికి తగ్గట్లుగా మారితేనే ఎక్కడైనా విజయం లభిస్తుంది. చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకుందామంటే ఎల్లకాలం సాగదు. అలా చెప్పి మంచు ఫ్యామిలీ కోసుకున్న కాయలు కూడా అయిపోయాయి. ఇప్పుడు వారు సొంతంగా తమ ప్రతిభ చూపించాల్సిన సమయం వచ్చింది. తాము కూడా ప్రజల్ని... ప్రేక్షకుల్ని రంజింప చేయగలమని నిరూపించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంతా సాధ్యం కాదు. అందుకే మంచు ఫ్యామిలీ టాలీవుడ్ నుంచి ఫేడవుట్ అయినట్లేనని..  ఒక వేళ వాళ్లు బౌన్స్ బ్యాక్ అయితే అద్భుతమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.