కళాతపస్వి కె. విశ్వనాథ్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్‌ చిరంజీవి. 'గురు తుల్యులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వం లో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషం గా వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారాయన. 


కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. గతేడాది దీపావళి రోజున తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు చిరంజీవి. పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన, నాకు గురువు మార్గదర్శి, ఆత్మబంధువు కె.విశ్వనాధ్ గారిని కలిసి, ఆ దంపతులని సత్కరించుకున్నానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు చిరు. 


తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన 'శభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి,  ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్‌ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సినిమాలుగా నిలిచిపోయాయి. 






ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు చిరు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. 


ఈ సినిమాతో పాటు దర్శకుడు బాబీతో ఓ సినిమా అలానే వెంకీ కుడుములతో మరో సినిమా కమిట్ అయ్యారు చిరు. ఇలా వరుస సినిమాలు ఒప్పుకుంటూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారాయన. వచ్చే రెండు, మూడు ఏళ్లలో చిరు నుంచి వరుస సినిమాలు విడుదల కానున్నాయి.