Japanese Forest Bath | మిలింద్ సోమన్ మీకు గుర్తున్నాడా? అదేనండి.. ఒకప్పుడు సూపర్ మోడల్‌గా అమ్మాయిల మనసు దోచుకున్న మిలింద్ సినిమాలు, వెబ్‌సీరిస్‌ల్లో కూడా నటిస్తూ.. అలరిస్తున్నాడు. 56 ఏళ్ల వయస్సులోనూ అమృతం తాగిన మన్మథుడిలా చురుగ్గా కనిపించే మిలింద్‌ను చూసి కుళ్లుకోని పురుషుడంటూ ఎవరూ ఉండరు. కండలు తిరిగిన శరీరం, ముఖంపై చెదరని చిరునవ్వు ఇతగాడి సొంతం. మరి ఇతడు మన బేబమ్మకు ఎప్పుడైనా ఇతడిని చూసి.. ‘‘వీడు ముసలోడు అవ్వకూడదే’’ అని అనేసిందో ఏమో, నిజంగానే అతడు ముసలోడు కావడం లేదు. తల మెరిసినా.. పాతికేళ్ల కుర్రాడు చేసి అన్ని పనులు చేసేస్తాడు. మన టాలీవుడ్‌లో నాగార్జున తరహాలోనే.. బాలీవుడ్‌లో మిలింద్ తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవలే అతడు తన ఫిట్‌నెస్ సీక్రెట్లను ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో పంచుకున్నాడు. అతడిలా చేస్తే మీరు కూడా తప్పకుండా యవ్వనాన్ని సొంతం చేసుకోవచ్చు. 


50 ఏళ్ల వయస్సులో ఫిట్‌గా ఉండాలని భావించడం.. చాలామందికి నెరవేరని కలలాంటిది. అయితే, మిలింద్‌ను చూస్తే మాత్రం.. ఆ వయస్సులో ఫిట్‌గా ఉండటం సాధ్యమే అనే ధైర్యం కలుగుతుంది. మిలింద్ ఒకప్పుడు జిమ్‌లోనే ఎక్కువగా కసరత్తులు చేసేవాడు. కానీ, కాలక్రమేనా అతడు తన ఫిట్‌నెస్‌ను పెంచుకొనేందుకు, యవ్వనంగా ఉండేందుకు కొత్త పద్ధతులను అనుసరించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అతడు కొత్తగా పురాతన జపనీస్ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను వెల్లడించాడు. అదే ‘ఫారెస్ట్ బాత్’ (Forest Bath). 
 
‘ఫారెస్ట్ బాత్’ (Forest Bathing) అంటే అడవిలోకి వెళ్లి స్నానం చేయడం మాత్రం కాదు. శరీరాన్ని.. ప్రకృతి అనుసంధానించే ప్రక్రియ. దీన్నే జపాన్‌లో Shinrin-Yoku (షిన్రిన్ యోకు) అని అంటారు. మిలింద్ ఇటీవల గుజరాత్‌లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఇకో క్యాంప్ సమీపంలోని అడవిలో పరిగెడుతూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న మిలింద్.. షిన్రిన్ యోకు గురించి వివరించారు. 
 
‘‘పరిగెత్తడం, నడవడం, కూర్చోవడం, నిలబడటం, ఊపిరి పీల్చుకోవడానికి అడవి ఉత్తమమైన ప్రదేశం. జపాన్ ఫిలాసఫీ ప్రకారం.. ‘షిన్రిన్-యోకు లేదా ఫారెస్ట్ బాత్’ ఇదే తెలియజేస్తుంది’’ అని తెలిపారు. ఫారెస్ట్ బాత్‌నే.. ‘ఫారెస్ట్ థెరపీ’ అని కూడా అంటారు. మన ఇంద్రియాలను అటవీ వాతావరణంతో అనుసంధించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. జపాన్‌లో 1980 నుంచి ఫారెస్ట్ బాత్‌కు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అడవిలో చెమటలు కక్కేలా నడవడం, పరిగెత్తడం ఈ ప్రక్రియలో భాగం. అంతేగాక, కళ్ల ద్వారా అటవీ అందాలను వీక్షించడం, స్వచ్ఛమైన వాసనలను ముక్కుతో పీల్చడం. పక్షుల కిలకిలలు, చిన్న చిన్న శబ్దాలు, గాలి హోరును చెవులతో వినడం.. ఇలా ప్రతి ఒక్కటీ ఆస్వాదించడమే ‘ఫారెస్ట్’ బాత్.


Also Read: చీమలే దెయ్యాలా? ఆ అడవిలో ఇతర చెట్లను చంపేస్తున్న చెట్లు.. అసలు నిజం వేరే ఉంది!


ఇది బయట నుంచి శరీరాన్ని, లోపలి నుంచి మనస్సును అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అవి రెండు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం, ఆందోళనలకు తావే ఉండదు. వయస్సు కూడా పెరగడం మరిచిపోతుంది. ఫారెస్ట్ బాత్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. హృదయ స్పందన రేటు అదుపులో ఉంటుంది. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సంతోషాన్ని అందించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ చుట్టుపక్కల మనుషులు తిరిగేందుకు అనువుగా ఉండే అడవుల్లో కాసేపు ప్రశాంతంగా తిరిగి వచ్చేయండి. లేదా వీకెండ్‌లో సరదాగా ఫారెస్ట్ ట్రిప్, ట్రెక్కింగ్‌కు వెళ్లి వచ్చేయండి. మనసు ఆహ్లాదకరంగా, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.