వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి వింటూనే ఉంటున్నాం. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా గుండె పోటు వచ్చి ఎంతో మంది ప్రాణాలని బలి తీసుకుంటుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గుండెకి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడే గుండె పోటు వస్తుంది. మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఇవి రెండు రాకుండా ఉండాలంటే కంటి నిద్ర నిద్రపోవాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి.


గుండె పోటు వచ్చిన సమయంలో రోగి ప్రాణాలను కాపాడటం చాలా కష్టం అందుకు చికిత్స కూడా లేదు. గుండె వైఫల్యం చెందితే చికిత్స చేసి ప్రాణాలు కొంతవరకు నిలపగలేరేమో కానీ గుండె పోటు వస్తే మాత్రం అది కష్టమనే అంటారు. కానీ అది ఇప్పుడు కష్టం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండెపోటు తర్వాత గుండెను రక్షించేందుకు శాస్త్రవేత్తలు మొట్టమొదటి ఇంజక్షన్‌ను రూపొందిస్తున్నారు. అటువంటి సమయంలో గుండెని రక్షించేందుకు కొత్తగా మూడు ప్రోటీన్లను వాళ్ళు కనిపెట్టారు. ఇవి గుండె వైఫ్యల్యాన్ని నిరోధించగలవు.


గుండెకి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు కండరాల భాగాలు చనిపోవడాన్ని ఆపడానికి ఇప్పటి వరకు వైద్యులకి మార్గం లేదు.. కానీ ఇప్పుడు ఆ మార్గం కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన్ పరిశోధనలు ప్రస్తుతం ఎలుకలు మీద నిర్వహిస్తున్నారు. అవి సత్ఫలితాలు ఇస్తే రాబోయే రెండేళ్లలో మనుషులపై కూడా ట్రయల్స్ వేయనున్నట్లు  పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


లండన్ కి చెందిన కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ మౌరో గియాకా మాట్లాడుతూ కొత్తగా రూపొందించిన మూడు ప్రోటీన్లలో దేన్నైనా ఉపయోగించి గుండె పోటు వచ్చిన వెంటనే గుండెకి సంబంధించిన నష్టాన్ని తగ్గించి అది ఆగిపోకుండా నిరోధిస్తుంది. ఈ ప్రోటీన్స్ ని ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు. ఆ మూడు ప్రోటీన్స్ కి Chrdl1, Fam3c, Fam3b అని పేర్లు పెట్టారు. ఈ ప్రోటీన్లు గుండె సంకోచం చేసే కణాలను బలోపేతం చేస్తాయి. చనిపోయిన లేదా దెబ్బతిన్న కణాలను తొలగించే ప్రక్రియను పెంచుతాయి.


ప్రోటీన్లతో చికిత్స పొందిన ఎలుకలు గుండెపోటు సమయంలో తక్కువ సెల్ డ్యామేజ్‌ను ఎదుర్కొన్నాయి.  ఆ తర్వాత మెరుగైన పనితీరును కనబరిచాయని చెప్తూ శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రోటీన్లు మానవ శరీరంలో సహజంగా పెరుగుతాయి. గుండెపోటు వచ్చిన వెంటనే ఈ ప్రోటీన్స్ ఇవ్వడం వల్ల అవి పని చేసి గుండె దెబ్బతినకుండా చికిత్స చేయగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన సమయంలో గుండె కొట్టుకోవడం ఆగదు కానీ కండరాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఎలుకల్లో వచ్చిన ఫలితాలు మానవుల మీద కూడా జరిపినప్పుడు సత్ఫలితాలని ఇస్తే అది చాలా సంతోషకరమైన విషయం అని మరొక ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. గుండెపోటు తర్వాత గుండె కణజాలం క్షీణించకుండా నిరోధించడానికి సమర్థవంతమైన చికిత్సలు లేవు కానీ ఇది విజయవంతం అయితే వాటిని కాపాడుకోవచ్చని వెల్లడించారు. ఇది గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్న రోగులకు చికిత్సలలో విప్లవాత్మక మార్పులు చేయగలదని నమ్మకం వెలిబుచ్చారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు


Also Read: స్పైసీ ఫుడ్ మస్త్ హెల్దీ, ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!


Also Read: నిమ్మరసం తాగితే మెరిసే చర్మం మీ సొంతం, మరెన్నో ప్రయోజనాలు