స్పైసీ ఫుడ్ చూస్తే నోరు అసలు కంట్రోల్ లో ఉండదు. వాటిని చూడగానే ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. మంట పుట్టినా ముక్కు కారుతూనే ఉన్నా కూడా స్పైసీ ఫుడ్ తినడం మాత్రం ఆపరు. అయితే కారం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో మంట వస్తుందని చాలా మంది అంటారు. అయిటే అది నిజమేనా.. అంటే అది కేవలం అపోహ మాత్రమే అని కొట్టి పడేస్తున్నారు కొంతమంది నిపుణులు. స్పైసీ ఫుడ్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతోందని చెబుతున్నాయి కొన్ని నివేదికలు. అయితే అది కూడా మోతాదుకు మించి మాత్రం తీసుకోకూడదు. స్పైసీ ఫుడ్ జీవక్రియని పెంచేందుకు తోడ్పడుతుంది.
మిరపకాయలకు కారాన్ని ఇచ్చే క్యాప్సైసిన్ పై అనేక పరిశోధనలు జరిగాయి. క్యాప్సైసిన్ కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి, కేలరీలు బర్న్ చేసి శరీర సామర్థ్యాన్ని పెంచుతుందని సదరు పరిశోధనలో తేలింది. అందుకే ఆహారంలో స్పైసీ ఫుడ్ ని తరచుగా చేర్చుకోవడం వల్ల జీవక్రియని పెంచుకోవచ్చు, అలాగే ఆకలిని తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్పైసీ ఫుడ్ తినడం వల్ల లాభాలు
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి, టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే స్పైసీ ఫుడ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వెర్మోంట్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ఎర్ర మిరపకాయల వినియోగం ఆకస్మిక మరణాల ముప్పుని 13 శాతం తగ్గిస్తున్నటు తేలింది.
స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణాశయంతర పేగులను ఇబ్బంది పెడుతుందని దాని వల్ల కడుపులో మంట, గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్తుంటారు. అయితే ఇవి తినడం వల్ల అటువంటి ఇబ్బంది ఏమి ఉండదని సదరు నివేదిక వెల్లడిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకి, శక్తిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుందని అంటున్నారు.
మసాలా ఆహారాలు పోషకాలతో నిండి పోషక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తాయి. ఉదాహరణకు మిరపకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, ఫైబర్‌తో పాటు విటమిన్ ఇ ఉంటాయి. అదే సమయంలో మిరపకాయ, పసుపు, కారం, నల్ల మిరియాలు వంటి మసాలా దినుసులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. స్పైసీ ఫుడ్ రుచిని ఆస్వాదిస్తే అది మీ పొట్టని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకపోతే వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు.
స్పైసీ ఫుడ్స్ తిన్న తర్వాత ఉబ్బరం, వాంతులు, విరేచనాలు ఇతర అసౌకర్య సమస్యలను ఎదుర్కోకపోతే జీర్ణశయాంతర సమస్యలు ఏవీ లేకుంటే ఎటువంటి డౌట్ లేకుండా హాయిగా స్పైసీ ఫుడ్ తీసుకోవచ్చు.
ఈ సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు
పేగుల్లో పూత వంటి లక్షణాలు ఉంటే స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వాటిని తీసుకోవడం వల్ల మీ రోగాన్ని అవి మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అల్సర్, పొట్టలో పుండ్లు ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే మీ బాధని అవి మరింత రెట్టింపు చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నిమ్మరసం తాగితే మెరిసే చర్మం మీ సొంతం, మరెన్నో ప్రయోజనాలు
Also Read: బొప్పాయి తింటే గర్భస్రావం నిజమేనా? గర్భిణీలు ఆ పండును ఎంత మోతాదులో తినాలి?