డెంగూ ఫీవర్ కు ఇంతవరకు ప్రత్యేకమైన ఔషధాలేవీ లేవు. ఫ్లూయిడ్స్ ను అధికంగా శరీరంలోకి పంపించడం, ప్లేట్ లెట్ల లెక్క పడిపోకుండా చూడడం... ఇలా డెంగూ బారిన పడిన వారిని కాపాడుకుంటూ వస్తున్నారు. తాజాగా డెంగూకు ప్రత్యేకంగా మందును కనిపెట్టినట్టు చెప్పారు లక్నోకు చెందిన శాస్త్రవేత్తలు. లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో డెంగూ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాదు ఈ ఔషధాన్ని మనుషులపై ప్రయోగించేందుకు (హ్యుమన్ ట్రయల్స్) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా పొందినట్టు చెబుతున్నారు పరిశోధకులు. త్వరలో ఈ మందును దేశంలోని 20 నగరాల్లోని కొంతమంది ప్రజలపై ప్రయోగించి పరీక్షించబోతున్నారు.
ఈ ఔషధం గురించి కొన్ని వివరాలు ఇవిగో...
1. ఈ ఔషధం మొక్కల ఆధారిత పదార్థంతో తయారుచేశారు. దీనికి AQCH అని పేరు పెట్టారు. ఇది సహజంగానే యాంటీ వైరల్ లక్షణాలు కలది. దీన్ని ప్రయోగశాలలోనూ, ఎలుకలపై కూడా పరీక్షించి చూశారు. విజయవంతమైన ఫలితాలను అందుకున్నారు.
2. కాన్పూర్, లక్నో, ఆగ్రా, ముంబై, థానే, పుణె, ఔరంగాబాద్, అహ్మదాబాద్, కోల్ కతా, బెంగళూరు, మంగళూరు, బెల్గాం, చెన్నై, జైపూర్, చండీగఢ్, విశాఖపట్నం , కటక్, ఖుర్దా, నాధ్ ద్వారా మొదలైన నగరాల్లో దీన్ని మనుషులపై ప్రయోగించనున్నారు.
3. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (GSVM) మెడికల్ కాలేజీ, లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU),ఆగ్రాలోని సరోజినీ నాయుడు (SN) మెడికల్ కాలేజీలు హ్యుమన్ ట్రయల్స్ కు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ప్రతి కేంద్రంలో వందమంది రోగులపై ఈ ఔషదాన్ని ప్రయోగిస్తారు.
4. హ్యుమన్ ట్రయల్స్ లో భాగంగా 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఎంపిక చేసుకుంటారు. ఆ వ్యక్తికి రెండు రోజుల ముందే డెంగూ ఫీవర్ ఉన్నట్టు నిర్ధారించబడి ఉండాలి.
5. ట్రయల్స్ లో భాగంగా రోగిని ఎనిమిది రోజుల పాటూ ఆసుపత్రిలో ఉంచుతారు. అతడికి ఏడు రోజుల పాటూ మందును ఇస్తారు. ఆ తరువాత 17 రోజుల పాటూ అతడిని పరిశీలనలో ఉంచుతారు.
ఈ మందు డెంగూను నిర్మూలించగలిగితే వైద్య శాస్త్రంలో మరో ముందడుగు వేసినట్టే.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి