కొంతమంది బస్సులో కూర్చోగానే కునికిపాట్లు పడుతుంటారు. ఇక వర్క్ హోమ్ చేస్తున్న వాళ్లలో కూడా చాలా మంది నైట్ షిప్ట్ చేసేటప్పుడు కూర్చుని, డెస్క్ మీదే తల పెట్టుకుని నిద్రపోతుంటారు. అందుకే నిద్ర సుఖమెరుగదని అన్నారు పెద్దలు. అలసటగా అనిపిస్తే చాలు కమ్ముకుని వచ్చే నిద్రని ఆపడం అంత సులభం కాదు. అయితే కూర్చోని నిద్రపోవడం ఆరోగ్యకరమేనా? నిద్రించే పొజిషన్ ఆరోగ్యంపైనా, నిద్రపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కూర్చొని నిద్రపోవడం వల్ల కొన్ని లాభ నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఆ లాభాలేంటో, నష్టాలేంటో ఇలా వివరిస్తున్నారు.
లాభాలు...
1. కూర్చుని నిద్రపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కొంత మంచి జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణిలకు. పొట్ట పెరుగుతున్నప్పట్నించి వారికి నిద్రపోయే భంగిమలలో కాస్త ఇబ్బంది కలుగుతుంది. అలాంటివారు కూర్చుని కూర్చుని నిద్రపోవడం వల్ల కాస్త సౌకర్యంగా అనిపించవచ్చు.
2. కూర్చుని నిద్రపోతున్నప్పుడు ‘అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా’ లక్షణాలు తగ్గించవచ్చు. ఆ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. తల ఎత్తైన స్థానంలో ఉండడమే దీనికి కారణం.
3. యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కూర్చోవడం వల్ల అన్నవాహిక పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల జీర్ణశయాంతర అసౌకర్యం, జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూర్చుని నిద్రపోవడం వల్ల కొంత ప్రయోజనం పొందుతారు.
నష్టాలు
1. ఎక్కువ సేపు కూర్చుని నిద్రపోవడం వల్ల నడుమునొప్పి వంటివి కలగవచ్చు. ఒకే రకమైన పొజిషన్లో శరీరం అధిక సమయం ఉన్నప్పుడు ఒళ్లు నొప్పులు మొదలవ్వచ్చు.
2. చాలాసేపు కదలిక లేకుండా నిద్రపోవడం వల్ల కీళ్లు పట్టేస్తాయి. అదే వెల్లకిలా పడుకుంటే శరీరం సాగుతుంది. కాబట్టి కీళ్లు పట్టే అవకాశం తక్కువ.
3. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ధమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డుంకులు ఏర్పడవచ్చు. దీని వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినవచ్చు.
ప్రాణానికే ప్రమాదమా?
ఎక్కువ సేపు కూర్చుని నిద్రపోవడం వల్ల రక్త నాళమైన సిరల్లో త్రాంబోసిస్ పరిస్థితి తలెత్త వచ్చు. అంటే సిరలో రక్తం గడ్డకట్టడమన్నమాట. ఈ పరిస్థితి కాళ్లు, లేదా తొడల్లోని సిరల్లో జరగచ్చు. ఒకేస్థితిలో ఎక్కువ గంటల పాటూ నిద్రపోవడం వల్ల కలిగే పరిణామం ఇది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాంతక పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇలా సిరల్లో రక్తం గడ్డ కట్టినప్పుడు చీలమండ, పాదాల వద్ద నొప్పిగా అనిపిస్తుంది. వాపు కనిపిస్తుంది. చర్మం ఎర్రబడుతుంది. కాళ్లలో తిమ్మిరి పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ సేపు కూర్చుని నిద్రపోవడం అంత మంచిది కాదు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
Also read: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి