పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక అని చాలా మంది భావిస్తారు. కానీ, ప్రస్తుతం కాలం మారిపోయింది. పద్దతులు, ఆచార వ్యవహారాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. పెళ్లి విషయంలో కూడా చాలా మంది రకరకాల అభిప్రాయాలను కలిగి ఉంటున్నారు. నచ్చితే కలిసి ఉండాలి. లేదంటే విడిపోయి సంతోషంగా గడపాలనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వాళ్లు.. పిల్లలు ఉన్నా సరే.. తమ మనుసుకు నచ్చిన వాళ్లు దొరికితే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు.


అందరి ముందు కాకుండా చాటు మాటుగా పెళ్లిళ్లు చేసుకునే మహానుభావులు కూడా తరుచుగా కనిపిస్తూనే ఉన్నారు. నిత్య పెళ్లికొడుకు, నిత్య పెళ్లి కూతురు అంటూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మహానుభావుడు ఒక్కరినో, ఇద్దరినో కాదు.. ఏకంగా 43 ఏళ్లలో 53 మందిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నిసార్లు ఏడాదికి  రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని పెళ్లిల్లు ఎందుకు చేసుకున్నావ్? అని అడిగితే.. అతడి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. 


53 వివాహాలు చేసుకున్న ఈ వ్యక్తి పేరు అబూ అబ్దుల్లా. వయసు 63 సంవత్సరాలు. ఉండేది సౌదీ అరేబియాలో. అబ్దుల్లా తన 20వ ఏట తొలి వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్సరాల పాటు ఆయన భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. తన 23వ ఏట మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో  కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాడు. తనకూ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడు. అలా వరుస బెట్టి 43 ఏండ్లలో 53 పెళ్లిళ్లు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. కానీ, అన్ని పెళ్లిల్లు ఎందుకు చేసుకుంటున్నావ్? ఎందుకు విడాకులిస్తున్నావ్? అని ఎవరైనా అడితే.. అతడు ఏం చెప్పాడో తెలుసా?


సాధారణంగా పెళ్లి చేసుకుంటే మనశ్వాంతి ఉండదని అంటారు. కానీ, అతడు మనశ్వాంతి కోసమే పెళ్లి చేసుకుంటున్నాడట. కానీ, ఎవరిని పెళ్లి చేసుకున్నా అది లభించకపోవడం వల్ల పదే పదే పెళ్లిల్లు చేసుకుంటూ మనశ్శాంతినిచ్చే భార్యతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడట. అతడు పెళ్లి చేసుకున్న 53 మందిలో ఏ ఒక్కరి దగ్గరా తనకు మనశ్శాంతి లభించలేదని అబ్దుల్లా వెల్లడించాడు. 


హాఫ్ సెంచరీకి పైగా పెళ్లిళ్లు చేసుకున్న ఈ మహానుభావుడికి సౌదీ ప్రజలు అరుదైన గుర్తింపు ఇచ్చారు. ఈ శతాబ్దపు బహుభార్యావేత్త అనే బిరుదు ఇచ్చారట. వాస్తవానికి భార్యలు గొడవపడటం తనకు చిరాకు కలిగిస్తుందని అబ్దుల్లా తెలిపాడు. అలా వారు గొడవపడటం భరించలేకే తలాక్ చెప్పినట్లు వెల్లడించాడు. “వాస్తవానికి నన్ను సంతోష పెట్టి, ఇంట్లో మనశ్శాంతిగా ఉంచే భార్య కోసం వెతుకుతూనే ఉన్నాను. ఒకావిడను పెళ్లి చేసుకున్న మరుసటి రోజే విడాకులు ఇచ్చాను. ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకున్న వారిలో ఓ విదేశీ మహిళ కూడా ఉంది. విదేశాల్లో నా వ్యాపార పనులు, నా బాగోగులు చూసుకునేందుకు ఆమెను చేసుకున్నాను. ఈ 53 మందిలో నాకు ఏ ఒక్కరితో మనశ్శాంతి లభించలేదు. ఇప్పటికైనా మంచి భార్య దొరుకుతుందేమో చూస్తున్నాను” అని అబ్దుల్లా చెప్పాడు.


అబ్దుల్లా పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మనశ్శాంతి కోసం ఇన్ని పెళ్లిళ్లు చేసుకునే బదులు ఒక్కడే ఒంటరిగా ఉంటే బెస్ట్ కదా అంటున్నారు. అసలు భార్యలతో మనశ్శాంతి వస్తుందని అనుకోవడమే అతడు చేసిన పెద్ద తప్పని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Also read: ఆ వయసు దాటిన ప్రతి కరోనా బాధితుడిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువ


Also read:  మనదేశంలో మోడల్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా? ఆ విషయంలో అమ్మాయిలే టాప్