ఇరవై ఒక్కేళ్లు కూడా రాకముందే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించిన ఘనత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ది. అతి చిన్న వయసులో ఉపాధ్యాయ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత మైసూరు విశ్వా విద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంలో కూడా తన సేవలు అందించారు. ‘భారతీయ తత్వ శాస్త్రం’ అనే గ్రంథం రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఓ సువర్ణాక్షరమే. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కూడా ఆయన వైస్ ఛాన్సులర్ గా పనిచేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా పనిచేసిన సర్వేపల్లి ప్రసంగాలు వింటే ఎవరైనా ఉత్తేజితులవుతారు. ఆయన మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. ఆయన 1952 నుంచి 1962 వరకు మనకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తరువాత అయిదేళ్ల పాటూ రెండో రాష్ట్రపతిగా చేశారు. ఆయన నోటి నుంచి జాలువారిన స్పూర్తి వాక్యాలు ఇవన్నీ.   


1. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. 


2. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. 


3. కంటికి కనిపించే మురికి గుంటల కన్నా, మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తలతోనే జాతికి ఎక్కువ ప్రమాదం. 


4. దు:ఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం. 


5. గ్రంథాలయాల ద్వారా సాహిత్యం నుంచి జీవితంలోకి ప్రవేశిస్తాము. 


6. ప్రపంచ చరిత్రలో హిందూ ధర్మం మాత్రమే మానవ మనస్సుకి సంపూర్ణ స్వేఛ్ఛను, స్వాతంత్య్రాన్ని ఇచ్చింది. దానికి తన శక్తుల మీద పూర్తి ఆత్మ విశ్వాసం ఉంది. హిందూ ధర్మం అంటే స్వేచ్ఛ. ముఖ్యంగా భగవంతుని గురించి ఆలోచించడంలో పూర్తి స్వేచ్ఛ. 


7. అన్నదానం ఆకలి తీరిస్తే, అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. 


8. నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే, నువ్వు వందమంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి. 


9. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం, ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. 


10. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో
భూమిని చూసి ఓర్పును నేర్చుకో
చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో
ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో


11. సంతోషకరమైన జీవితం సైన్సు, నాలెడ్జీ ఆధారంగా మాత్రమే సాధ్యమవుతుంది. 


12. మన గురించి మనం ఆలోచించుకోవడానికి సహాయం చేసేవారే నిజమైన ఉపాధ్యాయులు. 


13. మతం అనేది ప్రవర్తన మాత్రమే, నమ్మకం కాదు. 


14. పుస్తక పఠనం మనల్ని మనం తరచి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఆనందాన్ని అలావాటు చేస్తుంది. 


15. జీవితాన్ని చెడుగా చూడడం, ప్రపంచాన్ని మాయగా భావించడం తప్పు. 


16. మంచి పనులకు పునాది క్రమశిక్షణే. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది. 


17. శ్రద్ధగలవాడు మాత్రమే ఏ విద్యలోనైనా నేర్పు పొందగలడు. 


18. సాధించాలనే తపన... మన లోపాలు బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. 


Also read: మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన టీచర్లకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేయండి


Also read: దేశం గర్వించిన టీచర్ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ - తెలుగునాడుతో ప్రత్యేక అనుబంధం