ఎప్పుడూ ఒకేలాంటి దోశెలు వేసుకుని బోరు కొట్టింది. కొత్త రుచి కావాలంటే సగ్గుబియ్యం దోశెలు ప్రయత్నించండి. రుచి అదిరిపోవడం ఖాయం. అందులోనూ ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా. దీనిలో వాడేవన్నీ మంచి పదార్థాలే. 


కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - ఒక కప్పు
బియ్యం - ఒక కప్పు
మినపప్పు - అర కప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడినంత
మెంతులు - పావు స్పూను


తయారీ ఇలా
1. సగ్గుబియ్యం, మినప్పప్పు,  మెంతులు మూడు కలిపేసి ఒక గిన్నెలో వేసి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. 


2. బియ్యాన్ని మరో గిన్నెలో నానబెట్టుకోవాలి. 


3. మరుసటి రోజు ఉదయం సగ్గుబియ్యం, మినపప్పు, మెంతులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 


4. బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకుని సగ్గుబియ్యం రుబ్బులో కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. 


5. ఈ మిశ్రమంలో వెంటనే దోశె వేసుకున్నా బాగానే ఉంటుంది. లేదా కొన్ని గంటల పాటూ పక్కన పెట్టి కాస్త పులిశాక వేసుకుంటే చాలా రుచిగా వస్తాయి దోశెలు. 


6. ఇందులో వాడేవన్నీ ఆరోగ్యపరంగా మేలు చేసేవే, కాబట్టి పిల్లలకు లంచ్ బాక్సుల్లో కూడా పెట్టి పంపించవచ్చు. ఈ దోశెల్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.  


సగ్గుబియ్యంలోని పోషకాలు...
సగ్గుబియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాల్షియం,ఐరన్ కూడా లభిస్తాయి. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి అధికరక్తపోటు ఉన్న వారికి ఇది చక్కటి ఆహారం. ఇక మధుమేహం ఉన్న వారికి సగ్గుబియ్యం మంచివే. కాకపోతే సగ్గుబియ్యం దోశెల రెసిపీ బియ్యం వాడతాం కాబట్టి, మితంగా తినవచ్చు. శరీరం బక్కపలుచగా మారి, పోషకాహారం లోపంతో బాధపడేవారికి ఈ సగ్గుబియ్యం దోశెలు తినిపిస్తే మంచిది. కాస్త బరువు పెరిగే అవకాశం ఉంది. ఎముకలను బలంగా మార్చేందుకు ఇవి ఎంతో సహకరిస్తాయి. సగ్గుబియ్యాన్ని చాలా శక్తిని అందిస్తుంది. దీని వల్ల శరీర సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.  సగ్గుబియ్యంలో దోశెల మినపప్పును కూడా వాడతాం కాబట్టి ఈ దోశె మరింత శక్తిని అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ ఈ దోశెను తింటే రోజంతా నీరసం రాకుండా ఉంటుంది. 


Also read: చర్మం, గోళ్లు ఇలా మారాయా? అవి గుండె జబ్బు సంకేతాలు కావచ్చు, జాగ్రత్త పడండి


Also read: ఈ ఆక్టోపస్‌ల మధ్యలో ఒక చిన్న చేప ఇరుక్కుపోయింది, మీరు కనిపెట్టగలరా?