ఈ చిత్రంలో మీరు చూస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామం లోనిది. పొలంలో నుండి వేసిన కరెంటు వైర్లు కేవలం ఐదు అడుగుల నుండి ఆరడుగుల ఎత్తులోనే చేతికి అందేలా ఉన్నాయి. అవన్నీ కూడా త్రీ ఫేస్ కరెంటు వైర్లు. అంటే అందులో ప్రతీ వైర్ లోనూ కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఒకవేళ గాలి దుమారం వచ్చి వైర్లు గనుక ఒకదానికొకటి తాకినట్లయితే దాని కనెక్షన్ ఉన్నటువంటి వ్యవసాయ బావిలోని మోటర్లు కాలిపోతాయి. ఇక పొరపాటున పశువులను మేపే సమయంలో  కానీ లేదా పనులకు వెళ్లే మనుషులు కానీ పొరపాటున తాకినట్లయితే అక్కడికక్కడే ప్రాణాలూ పోవడం ఖాయం. నిజానికి విద్యుత్ శాఖకు చెందిన అధికారులు కరెంటు పోల్స్ వేసే సమయంలో కనీసం దూరాన్ని పాటించడం లేదు. మూడు పోల్స్ వాడే ప్రాంతాల్లో రెండు మాత్రమే వాడుతుంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. 


ఇప్పుడు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే తరహా పోల్స్ వేసి ఉన్నాయి. ఇప్పటికే వ్యవసాయం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్న రైతన్నలకు ఇవి ప్రాణాంతకంగా మారే పరిస్థితి ఉంది. సిరిసిల్లలోని వెంకటాపుర్ గ్రామంలో గతంలోనూ ఒక రైతు తన వ్యవసాయ పొలంలో నిల్చుని ఉన్న సమయంలో అక్కడే ఉన్న కరెంటు పోల్ ని తాకగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సంఘటన అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అయింది. 


సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ భవనం వద్ద కూడా అప్పట్లో ధర్నాలు కూడా చేశారు. కానీ అధికారులు తాత్కాలికంగా ఆ వ్యవహారాన్ని చక్కదిద్దారు. కానీ దీనికి పర్మినెంట్ సొల్యూషన్ మాత్రం వెతకలేదు. ప్రతి సంవత్సరం కరెంట్ షాక్ తో పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కడో ఒకచోట చనిపోతూనే ఉన్నారు. కానీ అధికారుల్లో మాత్రం ముందస్తు జాగ్రత్తలు లేవు.


సాధారణంగా రైతులు వ్యవసాయం కోసం వాడే మోటార్ల ఖరీదు కనీసం 25 వేల పైనే ఉంటుంది. ఒకసారి కరెంటు సరఫరాలో తేడాలు ఏర్పడితే అది కాలిపోతుంది. అలాంటప్పుడు ఒక రైతు కనీసం నాలుగు నుండి ఆరు వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొత్త మోటర్లు కూడా పనికిరాకుండా పోతాయి. ఇక వ్యవసాయం మొదలవుతున్న సమయంలో ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొంటే మంచిదని స్థానికులు చెబుతున్నారు.