Ex MLA Thati Venkateswarlu: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటి వరకు ఏదో రకంగా టిక్కెట్‌ దొరకుతుందనో.. లేక అధికార పార్టీని ఎదిరించి బయటకు పోతే ఇబ్బందులు తప్పవనో పార్టీలోనే ఉంటున్న నేతలకు ఇప్పుడిప్పుడు బయటకు వచ్చేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇందుకు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ గూటిలో సంచలనంగా మారాయి. 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తాటి ఆ తర్వాత వైఎస్సార్‌ సీపీలో చేరి 2014లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల క్రమంలో టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ 2018లో టీడీపీ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావుపై ఓటమి పాలయ్యారు. మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో తాటి ప్రాధాన్యత తగ్గినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు కనిపించిన తాటి వెంకటేశ్వర్లు అనూహ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అవి ఎటు దారి తీస్తాయనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. 
నేరుగా కేటీఆర్, తుమ్మలపైనే గురి చేస్తూ వ్యాఖ్యలు..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజకీయంలో తనకంటే జూనియర్‌ అని తాటి వ్యాఖ్యలు చేయడం పార్టీలో నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం సుగుమం చేసుకోవడమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అగ్రనేతపై వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం ఇదేనా అంటూ చర్చ సాగుతోంది. మరోవైపు సీనియర్‌ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్‌ చేస్తూ తాటి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేతలు గతంలో టీడీపీలో కలిసి పనిచేసినప్పటికీ ఆ తర్వాత విబేదాలు పెరిగాయనేది ప్రచారంలో ఉంది. దీంతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. తుమ్మలకు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో తాటి కాస్తా ఇబ్బందులకు గురయ్యారా..? అనే విషయం చర్చానీయాంశంగా మారింది. 
ఎవరి దారి వారు చూసుకుంటారా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మం మినహా మిగిలిన నియోజకవర్గాలో టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉనప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు అసెంబ్లీ టిక్కెట్‌ వేటలో పడ్డారు. దీంతోపాటు గతంలో పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కూడా ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ రాదని బావిస్తున్న నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. అక్కడ కూడా పోటీ పెరగకముందే తమ సీటు పక్కా చేసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేరుగా కేటీఆర్, తుమ్మలను టార్గెట్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మరి ఈ కోవలో ఎంత మంది బయటకు వస్తారనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 


Also Read: Telangana Corona Cases: అలర్ట్! ఒకేరోజు ఎగబాకిపోయి కరోనా కేసులు, ఆరోగ్యశాఖ హెచ్చరిక


Also Read: TRS Support Yaswant Sinha : యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు - కేసీఆర్ కీలక నిర్ణయం!