Festival Dessert Recipes : ఫెస్టివల్స్ సమయంలో వంటగదిలో ఎక్కువసేపు ఉండకూడదనుకుంటే.. మీ ప్రసాదాల్లో సగ్గుబియ్యం పాయసం(Saggubiyyam Payasam) యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకుంటే.. ఉదయాన్నే సింపుల్​గా పాయసాన్ని నిమిషాల్లో రెడీ చేయవచ్చు. పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ మెచ్చే ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో? టేస్టీగా చేసుకునేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


సగ్గుబియ్యం - 1 కప్పు


పాలు - 3 కప్పులు


డ్రై ఫ్రూట్స్ - కప్పు


నెయ్యి - 2టేబుల్ స్పూన్లు


కుంకుమపువ్వు - చిటికెడు


యాలకుల పొడి - అర టీస్పూన్


పంచదార - రుచికి తగినంత


తయారీ విధానం


ముందుగా సగ్గుబియ్యాన్ని 4 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేసి బాదం, పిస్తా, జీడిపప్పు పలుకలను వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు వీటిని ఫ్రై చేసుకుని పాన్​లోనుంచి తీసేయాలి. ఇప్పుడు అదే నెయ్యిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. 


సగ్గుబియ్యం కాస్త వేగిన తర్వాత దానిలో పాలు వేయాలి. పాలు, సగ్గుబియ్యం కలిసిన తర్వాత వాటిని ఉడకనివ్వాలి. అయిదు నిమిషాలు ఉడికించిన తర్వాత దానిలో కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో పంచదార వేసుకోవాలి. మీరు పంచదార తినొద్దు అనుకుంటే బెల్లం తురుము వేసుకోవచ్చు. పంచదార కరిగేవరకు దానిని బాగా కలపాలి. పంచదార కరిగి.. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత క్రీమి టెక్సచర్​ వస్తుంది. ఆ సమయంలో యాలకుల పొడి వేయాలి. 



అనంతరం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్​ని వేయాలి. అంతే వేడి వేడి సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ టేస్టీ సగ్గుబియ్యం పాయసాన్ని ఫెస్టివల్ సమయంలో ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. మీ పర్సనల్ అకేషన్స్ సమయంలో కూడా సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా చేసుకోవచ్చు. పైగా దీనిని వేడి వేడిగా తినొచ్చు. లేదంటే ఫ్రిజ్​లో పెట్టుకుని చల్లగా మారిన తర్వాత కూడా తినొచ్చు. 


ఈ టేస్టీ రెసిపినీ దసరా సమయంలో నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రసాదంగా కూడా దీనిని చాలామంది పెడతారు. ముఖ్యంగా దీపావళి సమయంలో ఎక్కువగా చేసుకుంటారు. పిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో ఇష్టంగా తినగలిగే రెసిపీ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ టేస్టి రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. 



Also Read : అమ్మవారికి ఆరో రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. దసరా స్పెషల్ పూర్ణం బూరెలు రెసిపీ