Dussehra 2024 Day 6 Special Purnam Burelu Recipe : దసరా (Dussehra 2024) సమయంలో అమ్మవారు 9 రోజుల్లో తొమ్మిది అవతారల్లో దర్శనమిస్తారు. అందుకే వీటిని దేవి నవరాత్రులు అనిపిలుస్తారు. ఒక్కోరోజు ఒక్కో స్పెషల్ నైవేద్యం కూడా చేస్తారు. అలా ఆరో రోజు అమ్మవారికి పూర్ణం బూరెలు పెడతారు. అమ్మవారికి మహా ప్రీతి అయిన బూరెలను ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా చేసుకుంటే పూర్ణంబూరెలు విడిపోకుండా మంచి షేప్‌లో వస్తాయో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
మినపప్పు - అరకప్పు
శనగపప్పు - 1 కప్పు
నీళ్లు - రెండు గ్లాసులు
బెల్లం - 1 కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
పంచదార - 2 టీస్పూన్లు
వంట సోడా - చిటికెడు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడేంత
తయారీ విధానం
పూర్ణం బూరెలు చేసుకునే ముందు రోజు రాత్రి మినపప్పును నానబెట్టుకోవాలి. మినపప్పు కప్పు తీసుకుంటే.. బియ్యం కప్పున్నర తీసుకోవాలి. ఇదే కొలతను మీరు ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటీని ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కడిగి.. నిండుగా నీరు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీటిని వడకట్టి మిక్సీ గిన్నెలోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోశల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలా అని పిండి మరీ లూజ్‌గా ఉండకూడదు. కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని కాస్త ఉప్పు కలిపి.. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
బూరెలు చేసుకునే గంట ముందు శనగపప్పును నానబెట్టుకోవాలి. అనంతరం నీళ్లు తీసేసి.. కడిగి.. కుక్కర్లోకి తీసుకోవాలి. దానిలో కప్పు శనగపప్పునకు రెండు కప్పుల నీళ్లు వేసి ఉడికించుకోవాలి. మినపప్పు కప్పు తీసుకుంటే శనగపప్పు, బెల్లం కూడా అవే కప్పుల్లో తీసుకోవాలి. రెండు లేదా మూడు విజిల్స్ వస్తే శనగపప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు శనగపప్పులోని నీటిని తీసేసి.. పప్పును కాస్త ఆరబెట్టుకోవాలి. శనగపప్పు నీటితో సాంబార్ చేసుకుంటే మంచి రుచి ఉంటుంది.
పప్పు కాస్త ఆరిన తర్వాత.. దానిని మిక్సీలోకి వేసుకోవాలి. కాస్త పప్పును పక్కన పెట్టుకోవాలి. పప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత దానిలో పక్కన పెట్టిన పప్పును వేసి కలపాలి. తినేపప్పుడు పప్పు తగులుతూ ఉంటే బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచాలి. దానిలో బెల్లం తురుము వేసి.. కాస్త నీరు పోయాలి. బెల్లం నీటిలో కరిగితే చాలు.. పాకం కావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలి.
ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పాన్‌లోకి తీసుకోవాలి. దానిలో బెల్లాన్ని పోసి.. స్టౌవ్ వెలిగించి రెండూ మిక్స్ చేస్తూ కలపాలి. ఇలా కొద్దిసేపటికి పిండి బెల్లం కలిసి దగ్గర పడుతుంది. ఈ సమయంలో కాస్త యాలకుల పొడి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. పిండిని కలిపితే ఉండాల మారుతుంది అనుకున్నప్పుడు స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు మినపప్పులో రుచికి తగినంత ఉప్పు, కాస్త పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల మినపప్పు లేయర్ క్రంచీగా, మంచి రంగుతో వస్తుంది.
స్టౌవ్ వెలిగించి దానిపై డీప్ ఫ్రైకి సరిపడేంతా కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత.. మినపప్పు పిండిలో.. పూర్ణాన్ని ముంచి.. అన్నివైపులా బాగా అంటుంకుందో లేదో చూసి దానిని తీసుకుని.. కడాయిలో వేయాలి. నూనెలో వేసిన వెంటనే అది కిందకి అంటుకోకుండా పైకి వస్తుంది. ఇలా మిగిలినవన్నీ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు రెడీ. వీటిని దసరా సమయంలోనే కాకుండా ప్రతి పండక్కి చేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదంటే ఫంక్షన్ల సమయంలో కూడా వీటిని చేసుకుని అమ్మవారికి పెడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నవరాత్రుల్లో మీరు కూడా ఈ వంటకాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి.
Also Read : చండీదేవికి చింతపండు పులిహోర, రవ్వకేసరి.. దసరా నవరాత్రుల్లో అయిదో రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే