Womens Safety : కోల్​కత్తాలో జరిగిన అతి బాధకరమైన విషయం యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఇలాంటి కుదిపేసే ఘటనలు రోజుకు.. సారీ సారీ నిమిషానికి.. క్షణానికొకటి జరుగుతున్నాయి. ముసలి నుంచి అప్పుడే పుట్టిన శిశువు మీద ఈ ఆగడాలు కొనసాగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నాయి కదా.. దీనికే ఎందుకు ప్రాధన్యతనిస్తున్నారు అంటే.. ఇది క్రూరత్వానికి పరాకాష్ట కాబట్టి. ట్రైనీ డాక్టర్ మీద జరిగిన ఈ ఘటన మానవత్వానికే మచ్చుతునకగా నిలిచింది. 


స్వాతంత్య్రం అయితే వచ్చింది కానీ.. బయట ఆడపిల్ల తిరిగే స్వేచ్ఛని మాత్రం ఇప్పటి సమాజం ఇవ్వలేకపోతుంది. ఈ అమానుష ఘటనల నేపథ్యంలో అమ్మాయిలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇంట్లోవారికి కూడా ఆడపిల్లను బయటకు పంపాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఇంట్లోనే ఉంటే జీవనం సాగదు. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సొసైటీని మనం మార్చలేనప్పుడు మనమే కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇది మీ రక్షణ కోసం చేసుకునే ఛేంజ్ అవ్వాలి. 


కచ్చితంగా చేయాల్సిన పని


దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్​ ఉంటుంది. వాటిలో మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్​లు మెయింటైన్​ చేయండి. హెల్ప్​లైన్, పోలీసులు.. ఫ్యామిలీ ఇలా ఎవరిదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్​లో ఉంచుకోండి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందించే సేఫ్టీ యాప్స్​ని కూడా ఇన్​స్టాల్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్లేప్పుడు.. మీ ఫోన్​లో ఛార్జింగ్ ఉందో లేదో చెక్​ చేసుకోండి. ఛార్జర్​ని తీసుకువెళ్లండి. ఛార్జర్​ లేని సమయంలో పవర్​ బ్యాంక్​ అయినా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫోన్​ ద్వారా మీరు ఓ వ్యక్తిని కాంటాక్ట్​ చేయగలిగే లేదా సహాయం కోరగలిగే సౌలభ్యం ఉంటుంది.


పెప్పర్​ స్ప్రే


మీ హ్యాండ్​ బ్యాగ్​లో పెప్పర్​ స్ప్రేని కచ్చితంగా ఉంచుకోవాలి. మీ మీదకి ఎవరైనా ఎటాక్​ చేస్తున్నారు అనుకున్నప్పుడు పెప్పర్​ స్ప్రేతో వారిపై దాడి చేసి.. అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. సేఫ్టీ పర్పస్​ కత్తిలాంటి దానిని తీసుకెళ్లవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీరు తప్పించుకోవడం కోసం దానిని చూపించి.. బెదిరించి పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రాణరక్షణకు హెల్ప్ అవుతుంది. ఈ తరహా వస్తువులు మీ చేతికి అనువుగా ఉండేలా చూసుకోండి. లోపల ఎక్కడో మూలన పడేయం కాకుండా.. చేతితో ఈజీగా తీసుకోగలిగే ప్రాంతంలో వాటిని ప్లేస్ చేయండి.


ఇది మరచిపోకండి​.. 


మీరు నమ్మిన వ్యక్తులు.. ఇంట్లో వారు, ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు చెప్పండి. పలానా వ్యక్తి, ఆ లోకేషన్​కి వెళ్తున్నాను అని చెప్పండి. మీ లోకేషన్​ని వారికి షేర్ చేయండి. డే టైమ్​లో కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మీ యాక్టివిటిని కనీసం ఒకరికైనా తెలిసేలా చేయండి. వీలైనంత త్వరగా మీ పని ముగించుకుని ఇంటికి వెళ్లండి. కానీ పక్షంలో మిమ్మల్ని పికప్ చేసుకోమని.. మీ పరిస్థితిని వివరించి ఎవరికైనా చెప్పండి. తప్పని పరిస్థితుల్లో రాత్రుళ్లు ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ లోకేషన్​ని వారికి పంపి.. అలెర్ట్​ చేయండి. 


స్కూల్​కి వెళ్లే పిల్లలకు.. 


పిల్లలకు వయసు రాలేదనో.. చెప్పలేకనో ఆగకుండా.. వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్​పై అవగాహన కల్పించండి. తెలియని వారికి దూరంగా ఉండమని చెప్పండి. తెలిసిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడి నుంచి పారిపోమని కూడా చెప్పండి. ఇదే కాకుండా పిల్లలకు చిన్న వయసు నుంచి కరాటే వంటివి నేర్పిస్తే.. తమని తాము రక్షించుకునే స్టేజ్​కి వస్తారు. అప్పుడు ఎవరి సహాయం వారికి అవసరం ఉండదు. ఇంట్లో అబ్బాయిలు ఉంటే.. వారికి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి. వారికి కూడా అమ్మాయిల పట్ల అవగాహన కల్పించండి. 


అబ్బాయిలందరూ కాదు..


అమ్మాయిలకు అండగా.. అబ్బాయిలు కూడా ఉంటారు. నాన్నగానో.. అన్నగానో.. ఫ్రెండ్​గానో.. భర్తగానో ఏదొక రూపంలో ఎవరో ఒకరు మీకు సపోర్టివ్​గా ఉంటారు. అలాంటి వారు మీ లైఫ్​లో ఉంటే వారికి రెగ్యూలర్​గా కాంటాక్ట్​లో ఉండండి. అలాగే మీరు వెళ్తున్నప్పుడు వారి సహాయం తీసుకోండి. వారితో పాటు వెళ్లకపోయినా.. వారికి మీ లోకేషన్ షేర్ చేసి అలెర్ట్​గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. 


అవగాహన సదస్సులు.. 


ఇలాంటి ఘటనలపై ఎంతగా ప్రజలు విరుచుకుపడతారో.. అంతే తొందరగా ఇతర ఘటన డామినేట్ చేస్తూ ఉంటుంది. దీంతో మళ్లీ షరామామూలు అవుతుంది. అలా జరగకుండా ప్రతి ఒక్కరికి.. వయసుతో, ప్రాంతంతో, లింగభేద తారతమ్యాలు లేకుండా.. వీటిపై అవగాహన కల్పించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపాలి. 


ఎండ్ ఆఫ్ ద డే


ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. ఎందుకంటే అలాంటి సమయం రాకూడదు. వచ్చినప్పుడు కాస్తో కూస్తో ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. బయటకు వెళ్లి ఇంటికి వచ్చేవరకు అమ్మాయిలు భయపడుతూనే ఉండాలి. ఆ సమయంలో మనల్ని కాపాడేందుకు ఎవరూ రాకపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరే సిద్ధం చేసుకోండి. సమస్యని ఎదుర్కొనేవిధంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. హెల్తీగా ఉంటూ.. శారీరకంగా బలంగా మారేలా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. ఎందుకంటే.. ఎండ్​ ఆఫ్​ ద డే ఇది మీ లైఫే. ఇతరులది కాదు. 


Also Read  : మహిళలు రోజుకు ఇన్ని గంటలు కచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అంతే