Bathukamma Special Recipes: తెలంగాణాలో ఎంతో కోలాహలంగా సాగే పండుగ బతుకమ్మ. ఆ తొమ్మిది రోజులు తెలంగాణాలోని ఆడపడుచులు బతుకమ్మను కొలుస్తూనే ఉంటారు. రోజూ ఆమెకు నచ్చే నైవేద్యాలను వండి పెట్టి నివేదిస్తారు. అన్నింటి కన్నా ముఖ్యమైన రోజు సద్దుల బతుకమ్మను పూజించే రోజు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను కొలుస్తాం. ఈ రోజున ఎన్నో రకాల నైవేద్యాలు వండుతారు. కొబ్బరన్నం, సత్తుపిండి అధికంగా వండుతారు చాలా మంది. ఈ రెండింటినీ వండడం కూడా చాలా సులువు.
సత్తుపిండి
కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - ఒక కప్పు
పంచదార - అరకప్పు
నెయ్యి - రెండు స్పూనులు
యాలకుల పొడి - అర స్పూను
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి బియ్యం పిండిని కాస్త వేయించాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఈ పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీజార్లో పంచదార పొడి చేసి పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో బియ్యం పిండి వేసి వేయించాలి.
4. స్టవ్ కట్టేసి బియ్యంపిండి చక్కెర పొడి, యాలకుల పొడి వేసి కలపాలి.
5. పోషకాలు నిండిన సత్తు పిండి రెడీ అయినట్టే.
6. అమ్మవారికి సమర్పించి తరువాత ప్రసాదంగా స్వీకరిస్తే బోలెడన్ని పోషకాలు అందుతాయి.
కొబ్బరన్నం
కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం -రెండు కప్పులు
పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు
కరివేపాకులు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - మూడు
కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
నెయ్యి - రెండు స్పూన్లు
శనగపప్పు - అర స్పూను
మినపప్పు - అర స్పూను
జీడిపప్పు - పది
జీలకర్ర - అర స్పూను
ఆవాలు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. అన్నాన్ని ముందుగానే వండుకుని పెట్టుకోవాలి. అన్నం పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందలో శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
3. తరువాత కరివేపాకులు, జీడిపప్పులు కూడా వేసి వేయించాలి.
4. స్టవ్ కట్టేసి మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి.
5. వేడి అన్నాన్ని, ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి.
6. పైన కొత్తమీర చల్లుకుంటే కొబ్బరన్నం రెడీ అయినట్టే.
బతుకమ్మ ఎప్పుడు ప్రారంభమైంది
బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కానీ..వేల సంవత్సరాల నుంచీ ఇది కొనసాగుతూ వస్తోందని చెప్పేందుకు చాలా కథలు చెబుతారు. అందులో ముఖ్యమైనది అమ్మవారి కథ. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా కలిసి గుమిగూడి పాటలు పాడారట. ‘బతుకమ్మా’ అంటూ ఆమెను వేడుకున్నారట. సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుంచీ ఆమె స్థానంలో పూలను ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందని చెబుతారు. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల్లో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.. ఆ ఒక్కరోజు అమ్మవారు అలుగుతుందని అందుకే అలిగిన బతుకమ్మ అంటారని చెబుతారు.
Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం