సగ్గుబియ్యం కొనేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. వాటితో ఏం చేసుకోవాలో తెలియకే సగం మంది వాటిని కొనడం తగ్గించుకున్నారు. నిజానికి సగ్గుబియ్యంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. అలాంటి  వంటకమే సగ్గుబియ్యం దోశెలు. పిల్లలు,పెద్దలు ఇద్దరికీ నచ్చే వంటకం ఇది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఇది పిల్లలకు బాక్సుల్లో కూడా పెట్టొచ్చు. మిగతా దోశెలతో పోలిస్తే సగ్గుబియ్యంతో చేసే దోశెలు చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో ఆరోగ్యం కూడా. అందులోనూ సగ్గుబియ్యం శరీరానికి ఎంతో చలువ చేస్తాయి. కాబట్టి వేసవిలో సగ్గుబియ్యంతో చేసే వంటకాలు అధికంగా వండుకుని తినాలి. 


సగ్గుబియ్యంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ సగ్గుబియ్యంలో పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడే ఎలక్ట్రోలైట్స్ ఇందులో ఉన్నాయి. వ్యాయామం చేశాక సగ్గుబియ్యంతో చేసిన జావను తాగితే చాలా మంచిది. వెంటనే శక్తి అంది అలసట తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా అవసరం. పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ, విరేచనాలు వంటివి ఇట్టే తగ్గుతాయి. 


సగ్గుబియ్యం దోశెలు


కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - ఒక కప్పు
బొంబాయి రవ్వ - అరకప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పెరుగు - మూడు టీస్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - రెండ స్పూనులు
జీలకర్ర - అర టీస్పూను
కరివేపాకు తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత 


తయారీ ఇలా 
1. సగ్గుబియ్యాన్ని బాగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి.
2. నానిన సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
3.  సగ్గుబియ్యం రుబ్బులో బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. 
4. పెరుగు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే నీళ్లు కలుపుకోవచ్చు. ఒక 20 నిమిషాలు పక్కన వదిలేయాలి. 
5. మళ్లీ ఆ మిశ్రమాన్ని గరిటెతో బాగా కలపాలి. అందులో కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, ఉల్లి తరుగు, జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. 
6. పిండి మరీ గట్టిగా ఉంటే నీళ్లు కలిపి పలుచటి దోశెలు వేసేలా రెడీ చేసుకోవాలి. 
7. పెనంపై సన్నని దోశెలు వేసుకోవాలి. చిన్న మంటపైనే దోశెలు వేయాలి. 
8. ఈ దోశెలను కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి. 


Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి


Also read: మధుమేహుల కోసం కాకరకాయ పొడి, రుచికి రుచి ఎంతో ఆరోగ్యం