చాలామంది సగ్గుబియ్యం ఏదో మొక్కకు కాస్తుందనుకుంటారు. కానీ కాదు, దాన్ని కర్రపెండలం దుంపలతో చేసే పిండి నుంచి తయారు చేస్తారు. పూర్వ కాలంలో వీటి వాడుక ఎక్కువగానే ఉండేది. పిజ్జాలు, బర్గర్ల కాలంలో మాత్రం చాలా తక్కువ మందిన వీటిని వినియోగిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు మీరు.  కర్ర పెండలం ఆఫ్రికా దేశాలలో ప్రధాన ఆహారం. దాదాపు 20 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది మొక్క. కింద భూమిలో దుంపలు కాస్తాయి. మనదేశంలో కేరళ, తమిళనాడులలో ఎక్కువగా పండిస్తున్నారు. 


బరువు తగ్గేందుకు...
సగ్గుబియ్యంలో కొవ్వు ఉండదు, ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణ క్రియ వేగాన్ని తగ్గిస్తుంది. పేగులు పోషకాలను అధికంగా గ్రహించేలా చేస్తుంది. దీని వల్ల పొట్ట నింపుగా ఉన్న ఫీలింగ్ వచ్చి, ఆహారం త్వరగా తీసుకోరు. కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంది. వీటిలో పోషక విలువలకు కూడా లోటు లేదు. అయితే కేలరీలు మాత్రం అధికంగా ఉంటాయి. కనుక మితంగా తింటే బరువు తగ్గే అవకాశం ఉంది. 


పిల్లలకు....
పోషకాహార లోపం ప్రధానంగా పిల్లల్లోనే కనిపిస్తుంది. ఆ లోపంతో బాధపడేవారికి సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తినిపిస్తే త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. నైజీరియాలో పిల్లలపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. కర్రపెండలంలో దొరికే పిండిపదార్థం పిల్లల్లో శక్తిని అందిస్తుంది. 


ఎంత బలమో...
వందగ్రాముల సగ్గుబియ్యంతో చేసిన ఆహారం తింటే 20 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. ఇది రోజువారీ అవసరాన్ని తీరుస్తుంది. ఇనుము, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఎముకలను బలంగా మారుస్తాయి. 


గుండెకు రక్ష
సగ్గుబియ్యం రోజూ తినడం అలవాటు చేసుకుంటే గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే అమిలోజ్ అనే పిండి పదార్థం అధికంగా లభిస్తుంది. 


గర్భిణీలకు
గర్భం ధరించడానికి ముందు, ధరించిన తరువాత కూడా సగ్గుబియ్యాన్ని తినడం అలవాటుగా మార్చుకోవాలి. ఇవి గర్భంలో బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ బి6, ఫోలేట్లు పిండానికి శక్తిని అందిస్తాయి.  బిడ్డలో న్యూరల్ ట్యూబ్ లోపం లేకుండా ఇది నిరోధిస్తుంది. 


ఏ వయసులో ఉన్నవారిలోనైనా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కనుక ఇంటిల్లిపాదికి మేలు చేసే సగ్గుబియ్యాన్ని మెనూలో చేర్చుకోవడం అన్నివిధాలా మంచిది. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి