ఇండియాలో ఇంటిపేర్లపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రస్తవన తెచ్చారు. భారత్ లో ఐదుగురు బైడెన్లు ఉన్నారంటూ జోక్ చేశారు. వెంటనే దానికి కౌంటర్ గా రిప్లై ఇచ్చారు ప్రధాని మోడీ. తనతోపాటు మీ వంశపారంపర్య చరిత్రను తెలిపే డాక్యుమెంట్స్ తీసుకొచ్చానని చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు.
1972లో సెనేటర్ గా గెలిచినప్పుడు ముంబై నుంచి తనకో లెటర్ వచ్చిందని చెప్పారు బైడెన్. అందులో తన ఇంటి పేరు బైడెన్ అని లేఖ రాసిన వ్యక్తి చెప్పినట్లుగా తెలిపారు. తర్వాత ఉపాధ్యక్షుడి హోదాలో ముంబై వచ్చినప్పుడు మీడియా ఈ విషయం గురించి ప్రశ్నించిందన్నారు. ఆ తర్వాతి రోజు భారత్ లో ఐదుగురు బైడెన్లు ఉన్నారని వార్తలు వచ్చినట్లుగా ఆనాటి విషయాల్ని గుర్తు చేశారు.
బైడెన్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. దీనికి సంబంధించి కొన్ని పత్రాలు తీసుకొచ్చానని తెలిపారు. వారంతా మీ బంధువులేనని చెప్పారు. బైడెన్ ఇంటిపేర్ల గురించి మీరు మాట్లాడారని, గతంలోనూ దీని గురించి చెప్పారని, అయితే వారి డాక్యుమెంట్ల కోసం అన్వేషించానని, వారికి సంబంధించిన కొన్ని దస్త్రాలు దొరికాయని, ఆ పేపర్లు మీకేమైనా ఉపయోగపడుతాయేమోనని మోదీ అన్నారు. దీంతో జో బైడెన్ నవ్వును ఆపుకోలేకపోయారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సమావేశంలో బైడెన్ అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోదీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు.
ఈ సమావేశం ఎంతో కీలకమైందని మోడీ చెప్పారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. భారత్- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.
అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం సందర్భంగా అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. టెక్నాలజీ ఇరు దేశాల రూపురేఖలను మార్చివేస్తుందని అన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య బలమైన బంధానికి విత్తనం నాటినట్లు మోదీ వెల్లడించారు. ఇక చర్చల్లో భాగంగా కరోనా వైరస్, వాతావరణ మార్పులు, క్వాడ్ సమావేశంపై లోతుగా చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇరు దేశాల అగ్రనాయకుల భేటీకి ముందు జో బైడెన్ తాను ప్రధాని మోదీతో వైట్‌హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్,కోవిడ్-19, వాతావరణంలో మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చిస్తామని ట్వీట్ చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: QUAD Summit: 'క్వాడ్' సదస్సులో శాంతి మంత్రం.. వ్యాక్సిన్ సరఫరా, ప్రపంచ భద్రతే లక్ష్యం