అధిక బరువుతో బాధపడేవారు, మధుమేహులు అన్నం తినేందుకు భయపడతారు. అధికంగా తింటే కెలోరీలు అధికంగా ఒంట్లో చేరుతాయని వారి భయం. కానీ చిన్న చిట్కాతో అన్నంలో కెలోరీలు సగానికి పైగా తగ్గించుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఉండే ఒక వస్తువే  అన్నంలో కెలోరీలు తగ్గించడానికి సాయ పడుతుంది. అదేంటో తెలుసా కొబ్బరినూనె. అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కొబ్బరినూనా? అని ఆశ్చర్యపోకండి. కేరళలో వంటలన్నీ కొబ్బరినూనెతోనే వండుతారు. ఆ నూనె ఎంతో ఆరోగ్యకరం కూడా. 


అన్నం ఏంచేస్తుందంటే...
కెలోరీలు అధికంగా ఉండే అన్నం శరీరంలో చేరాక ఏం చేస్తుందో ముందుగా తెలుసుకుందాం. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం అన్నం శరీరంలో చేరాక గ్లైకోజన్ గా మారుతుంది. తిన్నాక రెస్ట్ తీసుకోకుండా చురుకుగా పనిచేస్తుంటే ఇంధనంగా మారుతుంది. అలా కాకుండా నిద్రపోవడమో, కూర్చుని టీవీ చూడడమో వంటి పనులు చేసినప్పుడు గ్లైకోజన్ తనను తాను గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. దీనివల్ల మధుమేహ రోగులకు సమస్య. అలాగే కొవ్వుగా శరీరంలో పేరుకుంటుంది. ఫలితంగా అధిక బరువు పెరుగుతారు. అందుకే వీరు అన్నంలో కెలోరీలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. 


కొబ్బరి నూనె ఏం చేస్తుంది?
పరిశోధనల ప్రకారం బియ్యంలో కేలరీలను తగ్గించడానికి సమర్థమంతమైన మార్గం ఏమిటంటే అన్నం ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో ఒక టీస్పూను కొబ్బరి నూనె చేర్చి బాగా కలపాలి. అలా ఓ 25 నిమిషాలకు అన్నం సిద్ధమవుతుంది. కొబ్బరినూనె వల్ల అన్నంలోని కెలోరీలు 50 శాతం పైగా తగ్గిపోతాయి. కొబ్బరినూనె వేసి వండిన అన్నాన్ని ఫ్రిజ్ లో ఉండి కొన్ని గంటల తరువాత తింటే కెలోరీలు ఇంకా తగ్గిపోతాయి. శ్రీలంకకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. 


కొబ్బరి నూనె వేసి వండిన అన్నాన్ని మాత్రం చల్లబరిచాకే తినాలి.  దీనివల్ల ఇతర హానికర సమ్మేళనాలు కూడా పోతాయి. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అన్నం చల్లబడి తినడానికి వీలు లేకుండా అవుతుంది కదా అనుకోవచ్చు, కాస్త వేడి చేసుకుని తింటే సాధారణంగా మారిపోతుంది.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: మద్యం నిజంగానే బాధల్ని మరిచిపోయేలా చేస్తుందా? శరీరంలో చేరాక ఆల్కహాల్ చేసే పనేంటి?


Also read: ఒకప్పుడు సాగరకన్యలు నిజంగానే ఉండేవా, ఈ మమ్మీని చూస్తే నిజమే అనిపిస్తుంది