ఆల్కహాల్ తాగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆడా మగా తేడా లేకుండా తాగేస్తున్నారు. అసలెందుకు ఆల్కహాల్ కు ఇంతగా జనం దాసోహం అవుతున్నారు. దాని రుచికా? లేక అదిచ్చే కిక్కుకా? నిజం చెప్పాలంటే కిక్కుకే అనాలి. శరీరంలో చేరాక అసలు ఆల్కహాల్ ఏం చేస్తుంది? నిజంగానే అది బాధల్ని మరిచిపోయేలా చేస్తుందా? ఆనందాన్ని కలిగిస్తుందా? హ్యాంగోవర్ ఎందుకు వస్తుంది... ఈ విషయాలు తెలుసుకుందాం రండి.
బాధలు పోతాయా?
పూర్వం చాలా తక్కువ మొత్తంలో మద్యాన్ని ఔషధంలా తీసుకునేవారు. నిద్ర పట్టడానికి, ప్రయాణ బడలిక పోవడానికి మద్యాన్ని తాగేవారు. మితంగా మద్యం తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వారికి రాలేదు. తాగాక సంతోషంగా అనిపించేది,ప్రశాంతంగా నిద్రపట్టేది. కానీ అతి తాగడం ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు పెరిగాయి. మద్యం తాగడం వల్ల నిద్రపడుతుంది. నిద్రలో ఎవరైనా బాధలు మరిచిపోతారు. అంతే తప్ప మద్యమే బాధల్ని మరిపిస్తుందని మాత్రం కాదు. కానీ మద్యం పూర్తి నిద్రవ్యవస్థనే చిందరవందర చేస్తుంది.
మద్యం తాగి నిద్రపోవడం వల్ల పల్స్ రేటులో తేడా వస్తుంది. అధికంగా పెరిగిపోతుంది. దీనివల్ల ర్యాపిడ్ ఐ మూమెంట్ పెరిగిపోతుంది. అంటే నిద్రపోయినా కూడా కళ్లను కదిలిస్తూనే ఉంటాం. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒత్తిడి అధికం అయిపోతుంది. మద్యం వల్ల నిద్ర పట్టినా కూడా వారు మరుసటి రోజు నీరసంగానే ఉంటారు. వారిలో స్లీప్ సైకిల్స్ తగ్గుతాయి.అందుకేలా నీరసంగా అనిపిస్తుంది.
ఎక్కడి ప్రశాంతత?
మద్యం తాగాక ప్రశాంతంగా నిద్రపడుతుందనేది కేవలం అపోహ. శరీరంలోని నరాల వ్యవస్థ మద్యం వల్ల చురుకుగా మారిపోతుంది. గుండె కొట్టుకునే రేటు పెరిగిపోతువంది. దీనివల్ల రక్తపోటు పెరిగి అలసట విపరీతంగా అనిపిస్తుంది. కాబట్టి మద్యం వల్ల బాధలు మరిచిపోతాం, ప్రశాంతంగా ఉంటా అనేది కేవలం ఒక భ్రమ.
కాలేయం దెబ్బతింటుంది
ఆల్కహాల్ లో ఇథనాల్ ఉంటుంది. అది ఆహార నాళం ద్వారా వేగంగా శరీరంలో చేరుతుంది. చివరికి కాలేయానికి చేరుతుంది. కాలేయం జీవక్రియలను నిర్వహించడం చురుకుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కాలేయం ఏడీహెచ్ అనే ఎంజైమ్ ద్వారా జీవక్రియలను నిర్వహిస్తుంది. మద్యం అధికంగా కాలేయాన్ని చేరడం వల్ల ఎంజైమ్ అతిగా పనిచేయడం మొదలుపెడుతుంది. తద్వారా కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కాలేయం కణాలు దెబ్బతింటాయి. అలాంటి సమయం పొట్టలో మంటగా అనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి ఏర్పడితే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డెవలప్ అవడానికి కారణం అవుతుంది. అలాగే ఆల్కహాలిక్ హెపటైటిస్ లేదా సిర్రోసిస్ వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి అతి మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
Also read: మీకు రోజూ బీరు తాగే అలవాటుందా? అయితే మీ మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Also read: తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగుతున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి