Recovery Is the New Workout : ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని, ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని చాలామంది రోజూ వ్యాయామం చేస్తుంటారు. కొందరైతే ఒక్కరోజు కూడా వర్కవుట్‌ మిస్ కాకూడదని కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. దాని తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నారు వైద్యులు. 

Continues below advertisement

రికవరీ సమయం లేకుండా తీవ్రమైన వ్యాయామాలు చేస్తే అలసట పెరగడంతో పాటు కండరాలు, కీళ్లపై ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నారు.  మరి వ్యాయామం తర్వాత విశ్రాంతి ఎందుకు అవసరం? శరీరం కోలుకోవడం లేదని తెలిపే సంకేతాలు ఏమిటి? డాక్టర్స్ ఏమి హెచ్చరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్

Continues below advertisement

రెస్ట్ ఎందుకు అవసరం?

వ్యాయామం చేసేటప్పుడు కండరాలు, కీళ్లు, గుండెతో పాటు శరీరంలోని వివిధ వ్యవస్థలపై ఒత్తిడి పడుతుంది. వ్యాయామం తర్వాత శరీరం తిరిగి కోలుకోవడానికి, కండరాల్లో దెబ్బతిన్న కణజాలం మరమ్మతు కావడానికి.. ఖర్చయిన శక్తిని తిరిగి పొందడానికి తగినంత సమయం అవసరం. ఈ సమయంలోనే శరీరం వ్యాయామానికి అనుగుణంగా మార్పులు చెందుతుంది. తగినంత విశ్రాంతి లేకపోతే అలసట పెరిగి.. తర్వాతి వర్కవుట్లు చేయడం కష్టంగా మారవచ్చు.

హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్స్​లో క్లినికల్ డైరెక్టర్, ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ దశరధ రామారెడ్డి.. వ్యాయామంతో పాటు శరీరానికి తగినంత రికవరీ సమయం ఇవ్వడం చాలా ముఖ్యమని తెలిపారు. తీవ్రమైన వ్యాయామాలు చేస్తూ విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తే శరీరంపై అధిక ఒత్తిడి పడుతుందని తెలిపారు. అలా గ్యాప్ లేకుండా ఎక్కువ వ్యాయామం చేస్తే ఏమవుతుందో ఆయన వివరించారు. 

Also Read : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ఓవర్ ట్రైనింగ్

శరీరం పూర్తిగా కోలుకోకముందే పదేపదే తీవ్రమైన వ్యాయామాలు చేస్తే ఓవర్‌ట్రైనింగ్ సమస్య ఎదురుకావచ్చు. దీనివల్ల నిరంతర అలసట, వ్యాయామ సామర్థ్యం తగ్గడం, నిద్రలో ఇబ్బందులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాకుండా గాయాలయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. వ్యాయామం తర్వాత అలసట, కండరాల నొప్పి ఎక్కువకాలం ఉంటే.. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

విశ్రాంతి సరిపోవట్లేదని తెలిపే సంకేతాలు

వ్యాయామం చేసిన తర్వాత కండరాల్లో కొంత నొప్పి ఉంటుంది. అయితే నొప్పి తగ్గకుండా ఎక్కువకాలం కొనసాగి.. రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తే రెస్ట్ సరిపోలేదని అర్థం.  సరైన నిద్ర, విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. అలసట తగ్గకపోతే శరీరం పూర్తిగా కోలుకోవడం లేదనే సంకేతం కావచ్చు. గతంలో సులభంగా చేసిన వర్కవుట్లు ఇప్పుడు కష్టంగా అనిపించడం, బరువులు ఎత్తలేకపోవడం లేదా వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోవడం దీనిలో భాగమే.

Also Read : HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే

వ్యాయామం ఎక్కువగా చేస్తున్నప్పటికీ నిద్ర పట్టకపోవడం, మధ్యలో మెలకువ రావడం..  మానసిక స్థితిపై కూడా ప్రభావం పడవచ్చు. చిరాకు, ఉత్సాహం తగ్గడం వంటి మార్పులతో పాటు.. తరచూ గాయాలవుతున్నా లేదా విశ్రాంతి రోజులు తీసుకున్నప్పటికీ అలసట తగ్గకపోయినా వైద్యుల సలహా తీసుకోవాలి.

వ్యాయామం, విశ్రాంతి ఎలా బ్యాలెన్స్ చేయాలి?

డాక్టర్ దశరథ రామారెడ్డి ప్రకారం.. ప్రతిరోజూ తీవ్రమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఫిట్‌నెస్ స్థాయి, వ్యాయామ తీవ్రతను బట్టి విశ్రాంతి రోజులను ప్లాన్ చేసుకోవాలి. శరీరం కోలుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజూ 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేసే వారు తమ శారీరక శ్రమకు తగినంత ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు,విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందేలా తినాలి. 

Also Read : పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?

వ్యాయామం సమయంలో చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయాలి. బరువులు ఒక్కసారిగా ఎత్తడం, ఎక్కువ దూరం పరుగెత్తడం వంటివి ఒకేసారి చేయడం మంచిది కాదు. శరీర సామర్థ్యానికి తగ్గట్లు చిన్నగా ప్రారంభించి.. వాటిని కంటిన్యూ చేస్తూ పెంచుకోవాలి. 

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..

వ్యాయామం తగ్గించినా లేదా విశ్రాంతి తీసుకున్నా అలసట, నిరంతర కండరాలు లేదా కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు, వ్యాయామ సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు ఓవర్‌ట్రైనింగ్ వల్లే వస్తాయని చెప్పలేం. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలకు కారణం కావచ్చు.

Also Read : ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.