Ganesh Chaturthi Prasadam Recipes In Telugu : వినాయకుడుకి బెల్లం తాళికలు అంటే చాలా ఇష్టమని చెప్తారు. అందుకే వాటిని చవితి సమయంలో చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. పైగా వీటి రుచి కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలి. కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలతో చేస్తే పాల తాళికలు మరింత రుచిగా వస్తాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


పాలు - అరలీటరు


బియ్యం పిండి - 1 కప్పు


బెల్లం - 1 కప్పు


యాలకులు - 4


నెయ్యి - 1 టేబుల్ స్పూన్


జీడిపప్పు - ఇష్టానికి తగినన్నీ


ఉప్పు - చిటికెడు 


తయారీ విధానం


ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి గిన్నె పెట్టండి. దానిలో కప్పు నీళ్లు వేయాలి. అదే నీళ్లల్లో చిటికెడు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అవి కలిసేలా  బాగాకలపాలి. బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగిన వెంటనే బియ్యం పిండిని దానిలో వేసి ఉండలు లేకుండా దానిలో పూర్తిగా కలిసి పోయేలా కలిపాలి. ఉండలు లేకుండా పూర్తిగా కలిసేలా తిప్పి.. దానిని స్టౌవ్​ నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు బియ్యం పిండిని దగ్గరకు చేయాలి. పిండి కాస్త పొడిగా ఉంటే.. కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ.. పిండిని కలిపి ముద్దగా చేసుకోవాలి. ఉండలు లేకుండా పిండిని బాగా మెత్తగా, స్మూత్​గా పిసుకుతూ.. ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి నానుతూ ఉంటుంది. తర్వాత తాళికలు చేసేప్పుడు ప్రాసెస్​ ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టాలి. దానిలో బెల్ల పాకం చేసుకోవాలి. దీనికోసం దానిలో ఓ గ్లాస్ నీళ్లు వేసి.. నీటిని వేడికానివ్వాలి. 


నీళ్లు మరుగుతున్నప్పుడు దానిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం పూర్తిగా నీటిలో కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత యాలకులను దంచుకుని.. ఆ పొడిని బెల్లం పాకంలో వేసి కలపాలి. ఇప్పుడు దీనిని బాగా మరగనివ్వాలి. బెల్లం మిశ్రమాన్ని పట్టుకుంటే కాస్త తీగ మాదిరిగా రావాలి. ఇలా పాకం సిద్ధమైతే.. దానిని స్టౌవ్​నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నానిన బియ్యం పిండిని తీసుకోవాలి. దానిని మరోసారి బాగా మెత్తగా కలిపి.. తాళికలు చేసుకోవాలి. 


ముందుగా చేతులకు నెయ్యి రాసుకోండి. బియ్యం పిండిని చిన్న ముద్దను తీసుకుని దానితో రోల్స్​ చేయండి. ఇలా మొత్తం పిండిని చేసుకోవాలి. సన్నగా, పొడవుగా లేదా చిన్నని ఉండలుగా చేసుకుంటారు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో పాలు పోయాలి. మరికొన్ని నీళ్లు వేసి దానిని మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాళికలను వాటిలో వేసేయాలి. వీటిని పాలల్లో బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత తాళికలు పైకి వస్తాయి. అప్పుడే వాటిని కలుపుకోవాలి. 



మరో గిన్నెలో చెంచా బియ్యం పిండి తీసుకుని నీళ్లు వేసి కలుపుకోవాలి. తాళికలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాల తాళికల్లో వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పాల తాళికలు కాస్త చిక్కగా తయారైతాయి. దీనిని స్టౌవ్​ నుంచి దించిన తర్వాత.. ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని దీనిలో వేసి కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి నెయ్యితో కలిపి జీడిపప్పును వేయించుకోవాలి. వాటిని పాలతాళికల్లో వేసేయాలి. అంతే టేస్టీ టేస్టీ పాల తాళికలు రెడీ. దీనిని గణపతికి నైవేద్యంగా పెట్టేయడమే. 


Also Read : బెల్లంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. చవితి సమయంలో స్వీట్స్ దీనితో చేయడానికి ఇదే ప్రధాన కారణమట