Popular Ganesh Chaturthi Special Recipes : వినాయక చవితి (Vinayaka Chavithi 2024) సమయంలో పిండివంటలు ఎక్కువగా చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కలిసి సంతోషంగా చేసుకునే ఈ పండుగ సమయంలో ఎన్ని వంటలు చేసినా తక్కువే. ప్రసాదంగా ఎక్కువ స్వీట్స్ చేస్తారు. కాబట్టి ఎక్కువగా స్వీట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే కొందరు హాట్​గా, క్రిస్పీగా తినాలని అనుకుంటారు. అలాంటివారు మురుకులు, బూందీ చేసుకోవచ్చు. వీటిలో ఒక వంట చేయాలని పిండిని ఇతర పదార్థాలను రప్పిస్తే.. రెండో వంటను కూడా సులభంగా చేసేయొచ్చు. మరి ఈ టేస్టీ క్రిస్పీ రెసిపీలను ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మురుకులు కోసం కావాల్సిన పదార్థాలు 


బియ్యం పిండి - 1 కప్పు


శనగపిండి - 3 టేబుల్ స్పూన్స్


బటర్ - 1 టేబుల్ స్పూన్స్


జీలకర్ర - అర టీస్పూన్


ఇంగువ - చిటికెడు


ఉప్పు - రుచికి తగినంత 


నీళ్లు - పిండి సరిపడేంత 


నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత..


బూందీ కోసం కావాల్సిన పదార్థాలు 


శనగపిండి - 1 కప్పు


బియ్యం పిండి - అరకప్పు 


వామ్ము - 1 టీస్పూన్ 


ఇంగువ - చిటికెడు


పసుపు - చిటికెడు


కారం - పావు టీస్పూన్ 


నెయ్యి - 1 టేబుల్ స్పూన్ 


నీళ్లు - పిండికి సరిపడేంత 


నూనె - డీప్ ఫ్రైకి సరిపడా 


పల్లీలు - పావు కప్పు


జీడిపప్పు - 25


వేయించిన శనగపప్పు -  పావు కప్పు


కరివేపాకు - రెండు రెబ్బలు 


కారం - అర టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత 


తయారీ విధానం


ముందుగా బియ్యం పిండిని, శనగపిండిని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోండి. దానిలో రెండు టేబుల్ స్పూన్స్ బటర్ వేయండి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు అన్ని బాగా కలిసేలా పిండిని కలపండి. దానిలో చిటికెడు ఇంగువ వేసి.. మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు నీటిని కొద్ది కొద్దిగా వేస్తూ.. కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి మృదువుగా వస్తుంది. పిండి మరీ జోరుగా కాకుండా చపాతీ పిండి మాదిరిగా వచ్చేలా కలుపుకోవాలి.


ఇప్పుడు జంతికలు వేసే పరికరం లోపల కాస్త నూనె లేదా బటర్ రాసి.. ముందుగా తయారు చేసుకున్న పిండిని పెట్టాలి. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అది కాగిన తర్వాత కాస్త పిండిని వేస్తే.. పిండి పైకి తేలాలి. అప్పుడే మురుకులు ఫ్రై చేసుకోవడానికి నూనె సిద్ధమైందని అర్థం. దానిలో పిండిని మురుకులుగా వేసుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చే వరకు రెండు వైపులా వేయించుకుని తీసేయాలి. అంతే క్రిస్పీ, టేస్టీ మురుకులు రెడీ. 



బూందీ కోసం.. 


జంతికలు సిద్ధమయ్యేలోపు ఈ బూందీ బ్యాటర్​ని రెడీ చేసుకుంటే.. అదే నూనెలు బూందీ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో శనగపిండి, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. దానిలో వామ్ము వేయాలి. ఇంగువ, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ నూనెను తీసుకుని.. వేడి చేసి.. దానిని పిండిలో వేసి బాగా కలపాలి. అలాగే పిండిని మృదువుగా కలుపుకునేందుకు నీటిని వేసి బూందీ వేసేందుకు వీలుగా పిండిని ఉండలు లేకుండా కలపాలి. 


ఇప్పుడు గరిటపై కానీ.. మురుకుల వేసే పరికరంలో కానీ బూందీకి ఉండే ప్లేట్ తీసుకోవాలి. వేడి అయిన నూనెలో పిండిని గరిట సాయంతో బూందీగా వేసుకోవాలి. వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేయాలి. ఇప్పుడు అదే కడాయిలో జీడిపప్పు, పల్లీలు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు. అలాగే వేయించిన శనగపప్పును కూడా వేయించుకోవాలి. కరివేపాకు రెబ్బలను కూడా క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 


మిక్సింగ్​ బౌల్​లో బూందీ, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి.. కారం, ఉప్పును చల్లాలి. ఇవన్నీ కలిసేలా గరిటతో తిప్పాలి. అంతే టేస్టీ, క్రిస్పీ బూందీ రెడీ. దీనిని పండుగల సమయంలోనే కాకుండా సాయంత్రం స్నాక్స్​గా చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాలు వచ్చే సమయంలో ఛాయ్​కి ఈ రెండూ రెసిపీలు బెస్ట్ కాంబినేషన్​గా మారతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టేస్టీ, క్రిస్పీ రెసిపీలను ట్రై చేసేయండి. 


Also Read : బెల్లంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. చవితి సమయంలో స్వీట్స్ దీనితో చేయడానికి ఇదే ప్రధాన కారణమట