ఎన్ని కూరలు ఉన్నా పక్కన ఓ పచ్చడి డబ్బా ఉండాల్సిందే. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఇంత పచ్చడి వేసుకుని ఓ రెండు ముద్దలు తింటే ఆ రుచే వేరు. తెలుగు భోజనంలో పచ్చడి కచ్చితంగా ఉండాల్సిందే. నిల్వ పచ్చళ్లు ప్రతి తెలుగింట్లో ఉంటాయి.  రకరకాల పచ్చళ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకునేవే. 


కావాల్సిన పదార్థాలు
టమాటోలు - అరకిలో
పండు మిర్చి - అరకిలో
చింత పండు - చిన్న ఉండ
జీలకర్ర - ఒక టీస్పూను
వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
పసుపు - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - అర టీస్పూను
ఎండు మిర్చి - మూడు
నూనె - అయిదు స్పూన్లు


తయారీ ఇలా
1. టమాటో ముక్కలను కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తరువాత నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
2. కళాయిలో టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. మూత పెట్టి బాగా ఉడికించాలి. 
3.టమాటోలలోని నీళ్లు మొత్తం దిగి వేగాక, చింతపండు చిన్న ముద్ద వేసి కలపాలి. 
4. బాగా ఉడికాక స్టవ్ కట్టేసి చల్లారే వరకు పక్కనే పెట్టాలి. 
5.ఇక పండు మిర్చిని కడిగి తడి లేకుండా తుడిచి మిక్సీలో వేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి రుబ్బుకోవాలి. 
6. అందులో ఉడికించిన టమోటో మిశ్రమాన్ని కూడా వేయాలి. 
7. మెత్తగా రుబ్బుకోవాలి. 
8. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి పెట్టి నూనె వేయాలి. 
9. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. 
10. రుబ్బుకున్న పచ్చడిలో ఈ తాళింపును వేయాలి. అంతే టమాటో, పండు మిర్చి పచ్చడి రెడీ అయినట్టే. 
11. దీన్ని గాజు సీసాలో వేస్తే ఏడాది పాటూ నిల్వ ఉంటుంది. 


సింపుల్‌గా టమాటో పచ్చడిని ఇలా కూడా చేయవచ్చు. ఇందులో ఎండుమిర్చి అవసరం లేదు. ఈ ఇన్ స్టా ఖాతాలో సింపుల్ టమాటో పచ్చడి ఎలాగో చెప్పారు చూడండి.   






Also read: ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది