Making of Bonam : తెలంగాణలో బోనాలు చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఈ క్రమంలో అమ్మవారికి సమర్పించే బోనంని చాలా శ్రద్ధతో చేస్తారు. సాధారణంగా అమ్మవారికి సమర్పించే బోనంలో బెల్లం పరమాన్నం లేదా పెసరపప్పు అన్నం లేదా నవధాన్యాల పరమాన్నం లేదా పప్పు దినుసులతో అన్నం తయారు చేసి సమర్పించవచ్చు. అయితే పెసరపప్పుతో చేసిన రైస్ అమ్మవారికి బోనంగా సమర్పిస్తే చాలా మంచిది అంటున్నారు. మరి బోనం ఎలా చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? దానిని ఎంత శ్రద్ధగా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - అరకప్పు
పెసరపప్పు - అరకప్పు
నీళ్లు - మూడు కప్పులు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
బెల్లం - చిటికెడు
తమలపాకు - 1
వేపకొమ్మలు - 4
తయారీ విధానం
బోనం చేసే ముందు పాత్రను సిద్ధం చేసుకోవాలి. బోనాన్ని ఎప్పుడూ కొత్త దానిలోనే వండాలి. మట్టి కుండలో వండితే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే బోనాలను ఎక్కువగా మట్టి కుండలోనే వండుతారు. అయితే ఈ మట్టి కుండను కూడా కొత్తదే తీసుకోవాలి. ముందుగా దానిని కడిగి.. దానిపై కుంకుమ, పసుపు బొట్లు పెట్టాలి. ఇతర పాత్రల్లో బోనం చేసినా ఇదే విధంగా చేయాలి. అలాగే నీటిని స్వచ్ఛంగా, వినియోగించని నీటిని బోనం కోసం ఉపయోగించాలి.
బియ్యం, పెసరపప్పులో ఎలాంటి రాళ్లు, ఇతర పదార్థాలు లేకుండా చూసుకోవాలి. స్వచ్ఛమైన నీటితో పెసరపప్పు, బియ్యం వేసి బాగా కడిగి బోనం కుండలో వేయాలి. ఇప్పుడు పెసరపప్పు అన్నానికి సరిపడేలా మూడు కప్పుల నీటిని వేయాలి. ఇప్పుడు వాటిని స్టౌవ్‌పై పెట్టి ఉడికించాలి. అన్నం పొంగురాకుండా చూసుకోవాలి. బోనం అన్నం ఎప్పుడూ కుండని దాటి పొంగకూడదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పైగా బోనం అన్నంలో సాల్ట్ లేదా ఉప్పును అస్సలు ఉపయోగించకూడదు. మీడియం ఫ్లేమ్‌లో అన్నాన్ని ఉడికించాలి.
అన్నం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు దానిపై నెయ్యి వేయాలి. అనంతరం దానిపై రెండు బెల్లం ముక్కలు ఉంచాలి. ఇలా ఉంచిన దానిపై మూత వేసి.. ఉంచాలి. ఇప్పుడు కుండకి చుట్టు తమలపాకు తోరణం కట్టాలి. ఇప్పుడు వేపాకులు పైన కింద పెట్టి.. అమ్మవారికి బోనంగా సమర్పించాలి. పైగా తలస్నానం చేసిన తర్వాతనే రెడీ చేయాలి. అంతేకాకుండా బోనం వండే ముందు స్టౌవ్‌ని కూడా శుభ్రం చేసి కుంకుమ, పసుపు బొట్లు పెట్టాలి. బోనం చేసేప్పుడు ఈ విధంగా కచ్చితంగా చేయాలి. ఇప్పుడు బోనం అమ్మవారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉందని అర్థం.
Also Read : తెలంగాణ స్పెషల్ రెసిపీ మలీద ఉండలు.. బతుకమ్మ, బోనాలకు ఇవి ఉండాల్సిందే