సీజనల్ ఫ్రూట్ మామిడిపండు. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండును కచ్చితంగా తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యుట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మన శరీరం ఇనుమును సులువుగా శోషించుకుంటుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మామిడిపండు ఎంతో అవసరం. అలాగే బరువు తగ్గించే డైట్ లో కూడా ఇది ఒక భాగం. వీటిని తింటూ బరువును సులువుగా తగ్గొచ్చు. వైద్యులు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ బరువు తగ్గమని సూచిస్తారు. మామిడి పండుతో సింపుల్‌గా చేసుకునే రెసిపీలు ఇవిగో. వీటిని పెద్దగా వండాల్సిన అవసరం లేదు.
మామిడిపండు ఓట్స్ స్మూతీ
ఓట్స్ - రెండు స్పూన్లు
మామిడిపండు - ఒకటి
చియా సీడ్స్ - ఒక స్పూన్
నీళ్లు - ఒక గ్లాసు
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయియి పెట్టి అందులో ఒక గ్లాసు నీరు వేయాలి.
2. ఆ నీళ్లలో ఓట్స్, చియా సీడ్స్ వేసి ఉడికించాలి అవి మెత్తగా అయ్యాక చల్లారనివ్వాలి.
3. ఈ మొత్తం మిశ్రమాన్ని బ్లెండర్లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. 4. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసి పైన మామిడి పండు ముక్కలను వేసుకోవాలి. మామిడి పండు ఓట్స్ స్మూతీ రెడీ అయినట్టే.
.................................
కొబ్బరితో మామిడిపండు ఓట్ మిల్
లేత కొబ్బరి - 50 గ్రాములు
కొబ్బరి పాలు - అర గ్లాసు
ఓట్స్ - అర కప్పు
మామిడిపండు ముక్కలు - అరకప్పు
డ్రై ఫ్రూట్స్ తరుగు - గుప్పెడు
తేనె - ఒక స్పూను
యాలకుల పొడి - చిటికెడు
1. ఒక గిన్నెలో పైన చెప్పిన అన్ని పదార్థాలను వేసి బాగా కలిపి రాత్రంతా ఉంచాలి.
2. గిన్నెపై మూత పెట్టడం మర్చిపోవద్దుచ లేదా ఫ్రిడ్జ్ లో పెట్టినా మంచిదే.
3. ఉదయం లేచాక వాటిని అల్పాహారంగా తింటే ఆరోగ్యానికి మంచిది. రుచి కూడా అదిరిపోతుంది.
.................................
మామిడి సలాడ్
వర్జిన్ ఆలివ్ ఆయిల్ - ఒక స్పూను
పాలకూర - గుప్పెడు
మామిడిపండు - ఒకటి
తేనె - ఒక స్పూను
మిరియాల పొడి- చిటికెడు
1. పాలకూర ఆకులను బాగా కడిగి సన్నగా తురుముకోవాలి.
2. మామిడిపండును కూడా సన్నగా తరగాలి.
3. సలాడ్ చేయడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి గిన్నె కింద అడుగుభాగానికి బాగా పట్టించాలి.
4. ఆ గిన్నెలో పాలకూర తరుగును, మామిడిపండు తరుగును వేయాలి.
5. వాటిని బాగా కలపాలి. తేనే, పెప్పర్ కూడా చల్లి బాగా కలుపుకోవాలి.
6. ఆలివ్ ఆయిల్‌ను పైన చల్లుకొని సలాడ్ తినాలి.
ఈ మామిడి సలాడ్ కంటికి, చర్మానికి, మెదడుకు, కాలేయ పనితీరుకు మేలు చేస్తుంది.
Also read: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.