Rava Pulihora for Sravana Masam : పులిహోరను ప్రసాదంగా చేస్తూ ఉంటాము. చాలామంది దానినిని ఇష్టంగా తీసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా రవ్వ పులిహోరను తిన్నారా? శ్రావణమాసంలో చేసుకోగలిగే అత్యంత రుచికరమైన రెసిపీల్లో ఈ పులిహోర కూడా ఒకటి. దీనిని తయారు చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కానీ.. టేస్టీ రెసిపీ కోసం ఆ మాత్రం కష్టపడొచ్చు. మరి ఇంతకీ ఈ టేస్టీ రవ్వ పులిహోరను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం రవ్వ - 1 కప్పు
నీళ్లు - రెండు కప్పులు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తాళింపు కోసం
నూనె - 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
శనగపప్పు - టీస్పూన్
మినపప్పు - టీస్పూన్
జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్స్
ఎండు మిర్చి - 2
జీలకర్ర - అర టీస్పూన్
అల్లం తురుము -1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - రెండు రెబ్బలు
ఇంగువ - చిటికెడు
నిమ్మరసం - 1.5 టీస్పూన్స్
తయారీ విధానం
ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయల్లో గింజలు తీసేసి నిమ్మరసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పదార్థాలన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్ని పెట్టండి. దానిలో రెండు కప్పుల నీరు వేసి.. పసుపు, ఉప్పు, నూనె వేసి.. వేడిచేయాలి. నీరు బాగా కాగి మసులుతున్నప్పుడు దానిలో బియ్యం రవ్వను వేసుకుని మూతపెట్టాలి. బియ్యం రవ్వ ఉడుకుతుంది.
కుక్కర్ మూడు విజిల్స్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దానిలో ఆవిరి పోయే వరకు అలాగే ఉంచాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి.. దానిలోని రవ్వను ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిని ఓ గంట పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల రవ్వ కాస్త పొడిపిడిలాడుతూ మంచిగా రెడీ అవుతుంది. గంట తర్వాత ఇప్పుడు స్టౌవ్ వెలిగించి తాళింపు కోసం గిన్నె పెట్టండి.
ఈ తాళింపు గిన్నెలో నూనె వేయండి. అది వేడి అయ్యాక దానిలో ఆవాలు, మిరియాలు వేయాలి. అవి కాస్త చిట్లిన తర్వాత దానిలో జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ రెడ్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఇంగువ, కరివేపాకు, అల్లం తురము, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఎండు మిర్చి నల్లగా మారితే.. అది పర్ఫెక్ట్ తాళింపు అని అర్థం.
ఇలా సిద్ధం చేసుకున్న తాళింపును.. ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం రవ్వలో వేయాలి. తాళింపు మొత్తం బియ్యం రవ్వను అంటుకునేలా బాగా కలపాలి. ఇప్పుడు దానిలో ఒకటిన్నర చెక్కల నిమ్మరసాన్ని వేసుకుని.. మరోసారి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వ పులిహోర రెడీ. దీనిని శ్రావణమాసంలో చాలామంది చేసుకుంటారు. శ్రావణ మాసంలో ఉల్లిపాయలు తిననివారికి ఇది మంచి టేస్టీ రెసిపీ అవుతుంది.
Also Read : బ్రెడ్ బూరెలు.. వినడానికి కొత్తగా ఉన్నా, తినడానికి టేస్టీగా ఉంటాయి.. సింపుల్ రెసిపీ ఇదే