South Indian Sweet Recipes : తెలుగువారికి బూరెలకు ఉండే అనుబంధమే వేరు. దాదాపు అన్ని పండుగలకు ఈ టేస్టీ స్వీట్​ను తయారు చేస్తారు. నైవేద్యంగా కూడా పెడతారు. అయితే దీనిని చేసుకోవడం కాస్త శ్రమతో కూడుకున్న విషయమే. కానీ సింపుల్​గా బ్రెడ్​తో టేస్టీ బూరెలను తయారు చేసుకోవచ్చు. రుచికి బూరెలకు ఏమాత్రం తీసిపోదు. మరి ఈ టేస్టీ రెసినీ ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


నెయ్యి - 4 టీస్పూన్లు


బొంబాయి రవ్వ - కప్పు


బెల్లం - ఒక కప్పు కంటే కాస్త ఎక్కువ


యాలకుల పొడి - 


నీళ్లు - మూడు కప్పులు 


జీడిపప్పు - 10 


బ్రెడ్స్ - 15


నూనె - డీప్ ఫ్రైకి సరిపడా


తయారీ విధానం


ముందుగా స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యి కడాయిలో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి.. బొంబాయి రవ్వ నుంచి మంచి అరోమా వస్తుంది. దీనికి 5 నిమిషాలు పట్టొచ్చు. మంచి వాసన వచ్చాక స్టౌవ్​ని ఆపేయండి. ఇది వేయించుకునేప్పుడు కచ్చితంగా స్టౌవ్ దగ్గరే ఉండాలి. లేకుంటే రవ్వ త్వరగా మాడిపోయే ప్రమాదముంది. మంట కూడా తక్కువగానే ఉండేలా చూసుకోవాలి. దొరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి దానిలో బెల్లం వేయాలి. మూడుకప్పుల నీరు వేసిని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం నీటిలో పూర్తిగా కరిగిపోతే దానిలో వేయించుకున్న బొంబాయిరవ్వను వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత రవ్వ కాస్త దగ్గరపడుతుంది. ఆ సమయంలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు, యాలకులపొడి వేసి మరోసారి బాగా కలపాలి. పిండి మరింత దగ్గరకు ఉడుకుతుంది. దానిలో ఇప్పుడు మరో రెండు చెంచాల నెయ్యి వేసి కలిపి స్టౌవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. 


పిండి కాస్త చల్లారక.. చేతికి నెయ్యి రాసుకుని.. వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మొత్తం పిండిని బాల్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ తీసుకోవాలి. వాటి అంచులను కట్ చేసేయాలి. ఇప్పుడు బ్రెడ్​ను నీటిలో ముంచి.. మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు పెట్టుకోవాలి. బ్రెడ్​తో ఉండను పూర్తిగా కవర్​ చేయాలి. ఇలా అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. 



నూనె కాగిన తర్వాత.. బ్రెడ్​తో కవర్​ చేసిన బాల్స్​ను నూనెలో వేసి వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. అంతే టేస్టీ టేస్టీ బూరెలు రెడీ. చాలా సింపుల్​గా చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసేయండి. 


Also Read : మీకు దోశలు మెత్తగా ఉంటే ఇష్టమా? అయితే టేస్టీ, సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి