చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ వాటితో ఏం వండుకోవాలో మాత్రం చాలా మందికి తెలియక చిరుధాన్యాలను పక్కన పెట్టేస్తారు. సామలతో ఇలా టేస్టీ పులావ్ చేసుకుని తింటే ఎంతో మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. 


కావాల్సిన పదార్థాలు
సామలు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు 
క్యారెట్ - ఒకటి
జీడిపప్పులు - పది
ఎండు కొబ్బరి - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నెయ్యి - ఒకటిన్నర స్పూను
యాలకులు - మూడు
అల్లం తరుగు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరపిడా
బఠానీలు - మూడు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
బంగాళాదుంప - ఒకటి
నీళ్లు - తగినన్ని  
మిరియాలు - నాలుగు


తయారీ ఇలా
1. సామలను నీటిలో నానబెట్టి రెండు మూడు గంటలు ఉంచాలి.బాగా నానాక తీసి పక్కన పెట్టుకోవాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీలకర్ర, పచ్చి యాలకులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి కలపాలి. 
3. అందులో క్యారెట్లు ముక్కలు, బఠానీలు, బంగాళాదుంప ముక్కలు కూడా వేయించాలి. 
4. అవి బాగా వేగాక ముందుగా నానబెట్టుకున్న సామలను వేసి కలపాలి. 
5. అందులో మిరియాలు, ఉప్పు, రెండు కప్పుల నీళ్లు వేసి కలపాలి. 
6. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. 
7. మరొక కళాయిలోనే నెయ్యి వేసి ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసి వేయించాలి. 
8. ఈ రెండు వేగాక ఉడుకున్న పులావ్ రైస్‌లో కలిపేయాలి. పైన నిమ్మరసం చల్లాలి. 
9. పులావ్ ఉడికాక దించే ముందు పైన కొత్తిమీర చల్లండి. 


చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి సామలు. వీటిని తినడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. గోధుమల్లో 38 రెట్ల ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి, రక్త హీనత సమస్య తగ్గిపోతుంది. అందుకే సామలను పిల్లలు, మహిళలు ఆహారంలో భాగం చేసుకోవాలి. వంద గ్రాముల సామలలో 9.3 గ్రాముల ఐరన్, 7.7 ప్రొటీన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సామలు ముందుంటాయి. సామలు మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.  సామలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గుండెల్లో మంట, పొట్టనొప్పి వంటివి రావు. సామలను మహిళలు తినడం వల్ల  రుతుసమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది. కాబట్టి సామలను నిత్య ఆహారంలో భాగం చేసుకోవాలి.  ఫాలీఫెనాల్స్,యాంటీఆక్సిడెంట్లు  ఈ బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని ఇది తగ్గిస్తుంది. అధిక బరువుతో బాధపడే వారు సామలను తినడం చాలా ముఖ్యం. 


Also read: పరీక్షల సమయంలో పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే తినిపించాల్సినవి ఇవే


























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.