శరీరానికి శక్తిని ఇవ్వడమే ఆహారం ప్రధాన బాధ్యత. అలాగే శరీరంలోని అవయవాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా దాని పాత్రే ముఖ్యమైనది. కేవలం శరీరం మీదే కాదు, మెదడు మనసు మీద కూడా మనం తినే ఆహారాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని రకాల ఆహారాలు మెదడుకు బలాన్ని, యవ్వనాన్ని అందిస్తే, కొన్ని మాత్రం త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి. అంటే ఒత్తిడిని కలిగించే ఆహారాలు తినడం వల్ల వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంది. మెదడుకు చురుకుదనాన్ని ఇచ్చే ఆహారాలను ప్రత్యేకంగా తినడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు ఏకాగ్రత చాలా ముఖ్యం. వారికి పరీక్షల సమయంలో వారికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినిపించడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
చేపలు
కొవ్వు పట్టిన చేపలు పిల్లలకు తినిపించడం చాలా అవసరం. వీటిలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు ముఖ్యమైనవి. ఈ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా మెదుడుకు అందితే మతిమరుపు, డిమెంన్షియా, పక్షవాతం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినే వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
నట్స్
ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కేవలం చేపల్లోనే కాదు బాదం, జీడిపప్పు వంటి నట్స్‌లో కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలతో పాటు మాంగనీసు, సెలీనియం, రాగి వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని మెదడుకు వెళ్లే నాడులు సవ్యంగా పనిచేయడానికి అత్యవసరం. నట్స్ వల్ల మానసిక స్థితి కూడా మెరుగవుతుందని చాలా అధ్యయనాలు చెప్పాయి. మానసిక స్థితి మెరుగ్గా ఉన్న వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అధికంగా ఉంటాయి.
కోడిగుడ్లు
రోజుకో గుడ్డు తినమని ఇప్పటికే ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. గుడ్లలో కొలిన్ అనే ఒక పోషకం ఉంటుంది. ఇది శరీరంలోని కణాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. దీనివల్ల విషయ గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే రక్తంలో ట్రిప్టోఫాన్ అనే ఆమ్ల స్థాయిలను పెంచుతుంది. దీని పెంచడం వల్ల మెదడులో సెరటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఏకాగ్రతను పెంచుతుంది.
అల్పాహారం
బ్రేక్ ఫాస్ట్ ను చాలా మంది స్కిప్ చేస్తారు. కానీ ఉదయం పూట తినే అల్పాహారం ఎంత పోషకాలతో నిండి ఉంటే ఆ రోజంతా అంతా శక్తి సామర్ధ్యాలతో, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పనులు చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్పాహారం స్కిప్ చేయని పిల్లలుచదువులో బాగా రాణిస్తున్నట్టు కూడా కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
చక్కెర
చక్కెర అనగానే ఇంట్లోని పంచదార తినేయమని కాదు. మనం తినే ఆహారాల్లో సహజమైన చక్కెర ఉంటుంది. దీన్నే గ్లూకోజు అంటారు. ఈ చక్కెర ఉన్న పదార్థాలను సహజమైన చక్కెర ఉన్న పదార్థాలను పిల్లలకు తినిపించడం మంచిది. ఎందుకంటే మెదడుకు శక్తిని అందించేది చక్కెరే. చదువుతున్నప్పుడు ఏకాగ్రత కుదరకపోతే ఒక గ్లాసు ఏదైనా పండ్ల రసాన్ని తాగండి. కానీ పంచదార మాత్రం వేసుకోకండి. మీకు వెంటనే శక్తి వచ్చినట్టు అవుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే పంచదారను మాత్రం దూరం పెట్టాలి. సహజమైన చక్కెర లభించే పండ్లు కూరగాయలనే తినాలి.
Also read: మండే ఎండల్లో రోజూ ఈ పండ్లను తింటే మీ చర్మం సేఫ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.