వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఈ నెల 22న హానికారక ఇంజెక్షన్‌ తీసుకోవడంతో తాజాగా చనిపోయిన సంగతి తెలిసిందే. చావుబతుకుల మధ్య 5 రోజుల పాటు పోరాడి ఆమె చనిపోయింది. రాత్రి ఫిబ్రవరి 26 రాత్రి 9.10 గంటలకు చనిపోయినట్లుగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. దీంతో ప్రీతి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి స్వగ్రామం తరలించారు. నేడు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


మృతదేహం తరలింపులో గందరగోళం


మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఫ్యామిలీ, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఆందోళనకారులు ఏఆర్‌సీ వార్డు ముందు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఐసీయూ గ్లాస్‌ డోర్‌ను బద్దలుకొట్టారు. కొందరు మహిళలు అంబులెన్స్‌కి అడ్డుపడటంతో పాటు తాళం లాక్కున్నారు. దీంతో పోలీసులు వారిని వాహనాల్లోకి ఎక్కించి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నారంటూ ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని ప్యాక్‌ చేసి పంపుతామని ఓ వైద్యుడు అనడంతో బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్ధరాత్రికల్లా పోస్టుమార్టం పూర్తి చేసి ఉదయానికి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 


చివరికి అమె శరీరంతో ముందుగా బోడుప్పల్ నివాసానికి చేర్చారు. కానీ, అక్కడ ఉండకుండానే పోలీసులు ప్లాన్ మార్చారు. జనగామ జిల్లా మొంద్రాయికి ప్రయాణం అయ్యారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రీతి పుట్టిపెరిగిన ఉప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె తండ్రి పోలీసులను వేడుకున్నారు. తమకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నందు వల్ల వరంగల్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే ప్రీతి డెడ్‌బాడీతో వరంగల్‌కు పోలీసులు బయలుదేరారు. మొండ్రాయి గిర్ని తండాలో ఆమె అంతక్రియలు నేడు (ఫిబ్రవరి 27) జరగనున్నాయి.


ప్రీతి తండ్రి అనుమానాలు


ప్రీతి మరణం పట్ల ఆమె తండ్రి తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని, ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని, ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని అన్నారు. సైఫ్ అనే వ్యక్తే ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు విచారణలో కనుగొనాలని పిలుపునిచ్చారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ అనస్థీషియా డిపార్డ్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేయాలని, ఆ తర్వాత ఈ వ్యవహారంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.


ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా 
మెడిసిన్ పీజీ ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వపరంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో రూ.20 లక్షలు ప్రకటించారు.  వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసుకుని ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన విద్యార్థిని చనిపోయిందని తెలియగానే సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ర్యాగింగ్, వేధింపుల ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.