భారతీయులు ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారం ఇడ్లీ సాంబార్. మరికొంతమంది కొబ్బరి చట్నీతో కూడా తింటారు. వేడి వేడి సాంబార్ లో ఇడ్లీ వేసుకుని తింటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తారు. ఇవి తింటే కడుపులో తేలికగా ఉంటుంది. అలాగే సూపర్ హెల్తీ. ఎంతో మంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అయిన ఇడ్లీ నిజానికి భారతదేశానికి చెందినవి కావట. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇడ్లీ దక్షిణ భారతీయుల ప్రియమైన అల్పాహారంగా ఎలా మారిందో తెలుసా?
ఇదీ.. ఇడ్లీ కథ
కర్ణాటకకి చెందిన ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణులు కేటీ ఆచార్య చెప్పిన దాని ప్రకారం ఇడ్లీని 7 నుంచి 12వ శతాబ్దంలో ఇండోనేషియాలో గుర్తించారు. అక్కడ దీన్ని 'కెడ్లీ' లేదా 'కేదారి' అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా మంది హిందూ రాజులు ఇండోనేషియాని పాలించారు. వాళ్ళు సెలవుల్లో బంధువులని కలిసి తమకు వధువులను వెతుక్కోడానికి భారతదేశానికి వచ్చేవారు. అప్పుడు వాళ్ళు తమతో పాటు తమ రాజ్యంలో పని చేసే చెఫ్ లను కూడా వెంట తీసుకెళ్ళేవారు. అలా ఇండోనేషియా వంటకం కెడ్లీ కాస్తా భారత్ కి వచ్చి ఇడ్లీగా మారింది.
ఇడ్లీ మూలం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అరబ్బులు ఇడ్లీ తీసుకొచ్చారని ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ' అనే పుస్తకంలో, 'సీడ్ టు సివిలైజేషన్ ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలోను ఉంది. అరబ్బులు హలాల్ ఆహారాలు, రైస్ బాల్స్ మాత్రమే తినేవారు. ఈ రైస్ బాల్స్ కొద్దిగా ఫ్లాట్ ఆకారంలోకి మారి ఇడ్లీగా రూపాంతరం చెందాయని చెబుతారు. అరబ్బులు వీటిని కొబ్బరి గ్రేవీతో కలిపి తీసుకునేవాళ్ళు.
భారతీయ ఇడ్లీ గురించి
ఇడ్లీలు భారతీయ వంటకాల్లో భాగమని మన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి. 7వ శతాబ్దంలోని కన్నడ పుస్తకం 'వద్దరాధనే' తో సహా వివిధ ప్రాచీన గ్రంథాలలో ఇడ్లీ గురించి ప్రస్తావించారు. ఇది 'ఇద్దాలిగే' తయారీని వివరిస్తుంది. 10వ శతాబ్దంలో వచ్చిన తమిళ పుస్తకం 'పెరియ' పురాణంలోనూ ఈ వంటకం గురించి ప్రస్తావించారు. 10వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి వచ్చారు. వాళ్ళు ఈ ఇడ్లీ రెసిపీ తీసుకొచ్చారని అంటారు. ఏది ఏమైనప్పటికీ ఇడ్లీ ఎలా వచ్చిందనే దాని గురించి మాత్రమ స్పష్టమైన వివరణ రాలేదు. కానీ ఇది మాత్రం భారతీయ వంటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా నిలిచింది. ఎంతో మంది మనసులు దోచుకుంది.
మీకు తెలుసా?
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL) భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్షంలో వ్యోమగాములతో పాటు అంతరిక్షంలోకి వెళ్ళిన పదార్థం ఏంటో తెలుసా? సాంబార్ పౌడర్, చట్నీ పౌడర్ తో పాటు ఇడ్లీని కూడా తీసుకెళ్లారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి