బంగాళాదుంపతో చేసే కూరలు, వేపుళ్లు అంటే పెద్దలకు, పిల్లలకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా పిల్లలకు బంగాళాదుంప ఇష్టమైన కూర. ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో ఇస్తే మరీ ఆనందంగా తింటారు. అయితే బంగాళాదుంపతో చేసే స్వీటు గురించి తక్కువ మందికి తెలుసు. దీన్ని టేస్టు చేసిన వాళ్లు కూడా తక్కువే. దీన్ని చేయడం చాలా సులువు.  


కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - రెండు 
పంచదార - నాలుగు స్పూన్లు 
ఎండు ద్రాక్ష - ఒకటి 
బాదం పప్పులు - నాలుగు 
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్ 
పాలు - పావు కప్పు 
జీడిపప్పులు - ఐదారు 
పచ్చి యాలకుల పొడి - పావు టీ స్పూను


తయారీ ఇలా
1.  బంగాళాదుంపలను మెత్తగా ఉడకబెట్టి పైన తొక్క తీసేయాలి.
2.  వాటిని మెత్తగా చేత్తో మెదిపి ముక్కలు లేకుండా చూసుకోవాలి. 
3. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. మంటను మీడియం మీద ఉండేలా చూసుకోవాలి.
4.  నెయ్యి వేడెక్కాక అందులో మెదిపిన బంగాళాదుంపలను రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
5.  ఇప్పుడు అందులో పాలు, పంచదార వేసి బాగా కలపాలి.
6. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. మాడిపోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.
7. యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. 
8. ఇప్పుడు వేరే స్టవ్ మీద నెయ్యిలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. 
9. బంగాళాదుంప హల్వా ఉడుకుతున్నప్పుడు ఈ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను పైన చల్లుకోవాలి. 
10. అంతే ఆలు హల్వా రెడీ అయినట్టే.


బంగాళాదుంప మితంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిల్లలకు ఇది మంచి పౌష్టికాహారం. దీనిలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. వంద గ్రాములు బంగాళాదుంప తింటే మనకు వచ్చేది కేవలం 78 కేలరీలు, కాబట్టి అధిక బరువు తగ్గాలనుకుంటే వీటిని తినడం మంచిది. ఇందులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. అంటే బంగాళాదుంప తింటే అరటి పండు తిన్నట్టే. మలబద్ధకం సమస్య ఉన్న వారు వీటిని తింటే సుఖ విరేచనం అవుతుంది. ఆలు గడ్డల రసాన్ని కేవలం రెండు మూడు స్పూను రోజూ తాగినా చాలు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మ సమస్యలు ఉన్న వారు బంగాళాదుంప రసాన్ని రాసుకుంటే మచ్చలు పోతాయి. చర్మం మెరుస్తుంది. ఆలు గడ్డలను తరచూ తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.  డయాబెటిస్ ఉన్న వారు మాత్రం బంగాళాదుంపలను తినడం తగ్గించుకోవాలి. ఇందులో ఉండే పిండిపదార్థాలు, కార్బోహైడ్రేట్లు కలిసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తాయి.  కాబట్టి వాటిని పూర్తిగా మానేయడం మంచిది. 






Also read: నిద్ర తగ్గితే మధుమేహం వస్తుందా? నిద్రకు డయాబెటిస్‌కు మధ్య సంబంధం ఏంటి?