చికెన్ కర్రీ రుచికి పోటీ ఇచ్చేలా ఉంటుంది ఆలూ దమ్ కర్రీ. వెజిటేరియన్లకు ఇది ఎంతో నచ్చే కూర. చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడూ ఒకేలా బంగాళాదుంప కూర వండుకునే వారు ఓసారి ఇలా ప్రయత్నిస్తే రుచి కొత్తగా ఉంటుంది. 


కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - అర కిలో 
టమాటా - ఒకటి 
ధనియాల పొడి - అర స్పూను 
గరం మసాలా - అర స్పూను 
జీలకర్ర - అర స్పూను 
లవంగాలు - మూడు 
ఉల్లిపాయ - ఒకటి 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను 
పెరుగు - అర కప్పు
యాలకులు - రెండు 
ఉప్పు - రుచికి సరిపడా 
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
జీడిపప్పులు - మూడు 
కారం - ఒక స్పూను 
పసుపు - పావు స్పూను 
కొత్తిమీర - అరకట్ట 
నూనె - తగినంత


తయారీ ఇలా
1. ముందుగా బంగాళదుంపల్ని బాగా ఉడికించుకోవాలి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
2.  ఇప్పుడు కళాయిలో నూనె వేసి, నూనె వేడెక్కాక యాలకులు, లవంగాలు, జీడిపప్పు ముక్కలు, దాల్చిన చెక్క వేయించాలి.
3. అవి మాడిపోకుండా చూసుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి. 
4. అవి మెత్తగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. వాటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. 
5. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను మరీ చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి.
6.  పెద్ద ముక్కలకి టూత్ పిక్ తో రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి, పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, కారం వేసి కలపాలి.
7. ఈ పెద్ద బంగాళదుంప ముక్కలను అందులో వేసి రంగు మారేవరకు వేయించాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
8. అదే కళాయిలో జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. 
9. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయి సువాసన వస్తున్నప్పుడు, ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును కలపాలి. అది గ్రేవీలా అవుతుంది. 
10. ఒక ఐదు నిమిషాలు ఆ గ్రేవీ వేగాక పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
11. మీడియం మంట మీద ఉంచి, మూత పెట్టేయాలి. కాసేపటికి తీస్తే నూనె పైకి తేలేలా అవుతుంది.
12. అప్పుడు ముందుగా వేయించుకున్న బంగాళదుంపలను వేసి కలపాలి.
13.  గ్రేవీ మరి కొంచెం ఎక్కువ రావడం కోసం ఒక గ్లాసు నీళ్లు పోయాలి. అలా ఓ పది నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంచి సువాసన రావడం మొదలవుతుంది.
14.  చివరగా స్టవ్ కట్టేయడానికి ఐదు నిమిషాల ముందు తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. 
15. అన్నంతో తిన్నా బాగుంటుంది. చపాతీ, పులావ్‌లకు  ఇది మంచి జోడీ. దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.
16.  చికెన్ కర్రీ కి కూడా పోటీ ఇచ్చేలా ఉంటుంది ఈ ఆలూ దమ్ కర్రీ.


Also read: టమోటో కెచప్ ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు