పాలతో చేసే పనీర్ ఖరీదైనది. ఆ పనీర్‌ను తరచూ కొనలేము అనుకునేవారు, ఇంట్లోనే పప్పుతో పనీర్ తయారు చేసుకోవచ్చు. కేవలం రెండు పదార్థాలతో ఈ పనీర్‌ను రెడీ చేయొచ్చు. ఈ పనీర్‌లో కూడా పాలతో చేసిన పనీర్‌లాగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పాలతో చేసిన పనీర్ తిన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉండి, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ పనీర్ తిన్నా కూడా బరువు పెరగరు.  దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. 


మార్కెట్లో మసూర్ పప్పు దొరుకుతుంది. ఇది ఒక రకమైన కందిపప్పు. కాస్త ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని ఎర్ర కందిపప్పు అని పిలుస్తారు.  ఒక కప్పు మసూర్ పప్పు తీసుకొని మూడు, నాలుగు సార్లు బాగా కడగాలి. 
1. గోరువెచ్చని నీటిలో ఈ పప్పును వేసి 20 నిమిషాలు నానబెట్టాలి.  
2. 20 నిమిషాల తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. 
3. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒకటిన్నర కప్పు నీటిని వేయాలి. 
4. నీరు కొంచెం వేడెక్కాక మిక్సీలో రుబ్బుకున్న పిండిని కూడా వేయాలి. 
5. గరిటతో నిత్యం కలుపుతూనే ఉండాలి. అలా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించాలి.  
6. ఉండలు కట్టకుండా, గడ్డలు కట్టకుండా మిశ్రమం చిక్కగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. 
7. చిన్న మంట మీద ఉడికిస్తే, మాడిపోకుండా ఈ మిశ్రమం చిక్కగా అవుతుంది. తరువాత స్టవ్ కట్టేయాలి.
8. ఇప్పుడు చతురస్రాకారంలో ఉన్న ఒక గాజు కంటైనర్ను తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. పైన చిన్న క్లాత్ తో కప్పి మూత పెట్టేయాలి. 
9. ఆరుగంటల పాటు అలా వదిలివేస్తే, గట్టిపడి పనీర్ తయారవుతుంది. 
10. ఆ తరువాత గాజు కంటైనర్ నుంచి పనీర్ ను బయటికి తీస్తే, చతురస్రాకారంలోనే బయటికి వస్తుంది.  దాన్ని చిన్న చిన్న క్యూబుల్లా కట్ చేసుకొని పాలతో చేసిన పనీర్ లాగే వండుకోవచ్చు.  ఫ్రిజ్లో నిల్వ కూడా చేసుకోవచ్చు.


 ఎర్ర కందిపప్పు నిండా బోలెడు పోషకాలు ఉంటాయి, కాబట్టి ఈ పన్నీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పిల్లలకు ప్రోటీన్ చాలా అవసరం, ఈ పప్పు పనీర్ పెట్టడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. అంతేకాదు పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ సి, ఎ, బి1, బి2, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి అవసరమైనవే. వారంలో రెండు సార్లు ఈ మసూర్ దాల్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎర్రకంది పప్పు సాధారణ కందిపప్పు కన్నా త్వరగా జీర్ణం అవుతుంది. అంటే దీనితో తయారు చేసిన పనీర్ కూడా జీర్ణం అవుతుందనే అర్థం. అంతేకాదు ఈ పప్పు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. గర్భిణులకు ఎర్ర కందిపప్పుతో చేసిన వంటలు తినడం అవసరం. దీని ద్వారా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది. 


Also read: గీజర్‌లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి