రోటీ లేదా చపాతీ అనేది భారతీయులు ప్రధానంగా తీసుకునే ఆహారం. దీన్ని పప్పు లేదా కూరలతో తింటూ ఆనందిస్తారు. అయితే రోటీ లేదా చపాతీలు చేయడం అంత సులభమైన విషయం ఏమి కాదు. కొంతమంది చపాతీలు చేశారంటే వాటి షేప్ చూస్తే ఇలా కూడా ఉంటాయా అని డౌట్ వస్తుంది. మరికొందరి చేస్తే గట్టిగా ఉండి వాటిని తినడం అంటే దవడకి మంచి ఎక్స్సర్ సైజ్ ఇచ్చినట్టే అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అంటే మీరు పిండిని సరైన పద్ధతిలో కలపడం లేదని అర్థం. ఈ చిట్కాలు పాటించి పిండి కలిపారంటే చపాతీలను జస్ట్ రెండు వేళ్ళతో తుంచుకుని తినేయచ్చు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా మెత్తగా వచ్చేస్తాయి. అందుకు మీరు చేయాలసింది ఈ సాధారణ చిట్కాలు పాటించడమే.
గోరువెచ్చని నీళ్ళు
పిండి కలపడం కూడా ఒక కళ. పిండి కలిపడానికి చల్లటి నీళ్ళు అసలు వాడకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించి పిండి కలిపితే మెత్తగా వస్తాయి. ఇది మృదువైన రోటీలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఒకేసారి నీళ్ళు పొయ్యకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి.
బాగా కలపాలి
పిండిని హడావుడిగా కలపకూడదు. మెల్లగా ఎక్కువ సమయం తీసుకుంటే అన్ని వైపుల నుంచి పిండి లోపలికి వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపిన పిండి గట్టిగా ఉండకూడదు. ఉండలు చేసేటప్పుడు అవి గట్టిగా అనిపిస్తే రోటీలు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే మెత్తగా కలుపుకోవాలి. ఉండలు చేసేటప్పుడు మృదువుగా ఉండేలా చూసుకోవాలి. చివర్లో కొద్దిగా నూనె వేసి కలుపుకోవడం వల్ల చక్కగా వస్తాయి. ఇది వాటికి మెత్తదనం ఇస్తుంది.
20 నిమిషాలు నానబెట్టాలి
పిండి కలిపిన వెంటనే ఎప్పుడు రోటీలు చేసుకోకూడదు. పిండి పిసికిన తర్వాత ఒక తడి గుడ్డ కప్పి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే మెత్తగా వస్తాయి. అంతే కాదు పిండి తడి ఆరిపోకుండా కూడా ఉంటుంది.
మళ్ళీ కలుపుకోవాలి
నానబెట్టిన తర్వాత పిండిని మరొక నిమిషం పాటు మెత్తగా కలపాలి. వాటిని కాల్చే విధానం కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. వేదగా ఉన్న తవా మీద వేసుకుని కాల్చుకోవాలి. పిండి కలిపేటప్పుడు కాస్త పాలు కూడా వేసుకోవచ్చు. అది పిండికి మృదువుగా ఉండేలా చేస్తుంది. అవి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిగా అవకుండా మెత్తగా ఉంచుతుంది. కొన్ని గంటల తర్వాత వాటిని వేడి చేసుకుని తిన్నా కూడా మెత్తగానే ఉంటాయి. రుద్దుకునేటప్పుడు కొద్దిగా పిండి వేసుకుని అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా రుద్దుకుంటే వాటికి మంచి ఆకృతి కూడా వస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు