ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. నవ వధువు అత్తవారింట్లో స్నానానికి వెళ్ళింది, కానీ ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూశారు. అప్పటికే ఆమె బాత్రూంలో ఒక మూల పడిపోయి ఉంది.  దీనికి కారణం గీజర్ నుంచి లీకైన గ్యాస్.  ఆ గ్యాస్ పీల్చిన నవవధువు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అందుకే గీజర్లు వాడేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు స్టవ్ మీదో లేక కట్టెల పొయ్యి మీదో నీళ్లు కాచేవారు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో గీజర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పనులను సులభతరం చేస్తున్నాయి, కానీ వాటి వెనుక ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి. గీజర్ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఎవరూ అనుకోరు. 


ఆ గ్యాస్ ఏంటి?
గీజర్లలో ఉండే గ్యాస్ ఏమిటో తెలుసా? ప్రాణాంతకమైన కార్బన్ మోనాక్సైడ్. ఇది ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు లీక్ అయ్యే అవకావం ఉంది. దీన్ని పీల్చిన కొద్ది నిమిషాల్లోనే మైకం కమ్మి అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. ఇది విషంతో సమానం. ఇది మనిషి ప్రాణాలను ఇట్టే తీసేస్తుంది. ఊపిరి అందక మరణం సంభవిస్తుంది. అందుకే గీజర్లు వాడేవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు వైద్యులు. 


ఏం చేయాలి?
1. బాత్రూంకి కచ్చితంగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. చాలా మంది ఎలాంటి వెంటిలేషన్ లేకుండా కట్టేస్తారు. బాత్రూమ్ లో కిటికీ కచ్చితంగా ఉండాలి. 
2. వెంటిలేషన్ ఉంటే గ్యాస్ లీకైనా కూడా బయటకి పోయే అవకాశం ఉంది. 
3. అలాగే కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను వేసి ఉంచాలి. గీజర్ వేసినప్పుడే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని కూడా వేసి ఉంచాలి. ఒకవేళ గ్యాస్ లీక్ అయిన ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా బయటికి వెళ్లిపోతుంది. 
4. మీకు బాత్రూంలో ఉన్నప్పుడు ఊపిరాడనట్లు అనిపిస్తే ఒక్క సెకను కూడా అక్కడ ఉండకండి. వెంటనే బయటికి వచ్చేయాలి. దగ్గుతూనే ఉండాలి. 


కార్బన్ మోనాక్సైడ్ కొంచెం పీల్చినా కూడా అనేక సమస్యలు వస్తాయి. వాంతులు అవ్వడం, వికారం, తలనొప్పి, తల తిరగడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి కొన్ని నెలల పాటు యాంటీ సీజర్ మందులతో చికిత్స చేస్తారు. 


గీజర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఎలాంటి లీకేజీలు లేవని నిర్ధారించుకోవాలి. చిన్న లీకేజీ ఉన్నా కూడా దాన్ని వాడకూడదు. ఏమాత్రం ఊపిరి తీయడానికి ఇబ్బంది అనిపించినా సెకను కూడా ఆలస్యం చేయకుండా, ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోవాలి.


Also read: దగ్గు వచ్చినప్పుడు ఆపుకుంటున్నారా? దగ్గడం ఎంత ముఖ్యమో తెలుసా








































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.