తాండై అనేది ఒక సాంప్రదాయ పానీయం. ఉత్తర భారత దేశంలో దీన్ని ప్రధానంగా హోలీ పండుగ రోజు తయారుచేసి తాగుతారు. హోలీ పండుగకు మన దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.  దీన్ని వసంత రుతువు ఆగమనంగా పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.  చలికాలం తొలగిపోయి ఎండాకాలం ఆరంభానికి ఈ పండుగనే నాందిగా చెప్పుకుంటారు. హోలీ రోజున స్వీట్లతో ఇరుగు పొరుగువారి నోటిని తీపి చేసుకుంటారు. తాండై కూడా తియ్యగా పోషకాలతో నిండి ఉండే పానీయం. దీన్ని చేయడం కూడా చాలా సులువు. 


కావాల్సిన పదార్థాలు
బాదం పప్పులు - ఐదు 
జీడిపప్పులు - ఐదు 
పిస్తా పప్పులు - ఐదు 
పుచ్చకాయ గింజలు - ఒక స్పూను 
గసగసాలు - రెండు స్పూన్లు 
పచ్చి యాలకులు - ఐదు 
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
నల్ల మిరియాలు - ఒక స్పూను 
పాలు - ఒక కప్పు 
పంచదార - ఒకటిన్నర కప్పు 
గులాబీ రేకులు - గుప్పెడు


తయారీ ఇలా
1. బాదం, జీడిపప్పు, పిస్తా, పుచ్చకాయ గింజలు, గసగసాలు, పచ్చి యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు అన్ని ఒక గిన్నెలోకి వేసి కలుపుకోవాలి. 
2.  వాటిని మిక్సీలో వేసి పొడిగా మార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కప్పు పాలను పోయాలి.
3.  పాలు మరిగాక పంచదారను వేసి కలపాలి. పాలు, పంచదార మిశ్రమాన్ని బాగా మరగకాచాలి. 
4. మరుగుతున్న పాల మిశ్రమంలో, ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న పొడి వేయాలి. వీటిని వేసి బాగా కలపాలి.
5. మిశ్రమం మరీ నీళ్లలా కాకుండా, అలానే చిక్కగా కాకుండా... మధ్యస్థంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేయాలి. 
6. చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిజ్లో పెట్టాక అది ఛిల్ అవుతుంది. 
7. బయటకు తీసి పైన గులాబీ రేకులను చల్లి, అవసరమైతే బాదం, పిస్తాల తరుగును వేసి సర్వ్ చేయాలి. 
8. దీని రుచి అదిరిపోతుంది. 
ఇందులో నట్స్ ఎక్కువగా ఉపయోగించాం, కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. కాకపోతే డయాబెటిస్ పేషెంట్లు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే తాండైలో చక్కెర అధికంగా ఉంటుంది. 


ఆరోగ్యానికి మంచిది
ఇందులో వాడిన పుచ్చకాయ గింజలు, బాదం, జీడిపప్పు, పిస్తాల వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అలాగే మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. గులాబీ రేకులు శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తాయి. పచ్చి యాలకులు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. ఇక గసగసాలు మన జీర్ణ వ్యవస్థకు, జీర్ణక్రియకు ఎంతో మంచిది.  హోలీ రోజున మీరు కూడా ఓసారి ఈ పానీయాన్ని టై చేసి చూడండి.


Also read: ప్రతి భారతీయ మహిళా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు, చట్టాల జాబితా ఇదిగో















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.