Crispy and Tasty Punugulu Recipe : వర్షం వస్తున్నప్పుడు కరకరలాడేలా, కాస్త స్పైసీగా, టేస్టీగా ఉండేలా తినాలనుకుంటే పునుగులు బెస్ట్ ఆప్షన్. వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. అయితే ఇప్పుడు మీరు చూసే రెసిపీ కూడా మీకు మంచి టేస్టీ అనుభవం ఇస్తుంది. చాలా సింపుల్​గా ఈ పునుగులను చేసుకుని హాయిగా లాగించేయవచ్చు. ఇంతకీ ఈ టేస్టీ, క్రిస్పీ పునుగులను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


పెరుగు - కప్పు


ఉప్పు - రుచికి తగినంత


బియ్యం పిండి -పావు కప్పు


ఉప్మా రవ్వ - అరకప్పు


మైదా పిండి - 1 కప్పు 


వంటసోడా - చిటికెడు


నీళ్లు - తగినంత


జీలకర్ర - అర టీస్పూన్


కరివేపాకు - 1 రెబ్బ


కొత్తిమీర - 1 చిన్న కట్ట


పచ్చిమిర్చి - 4


ఉల్లిపాయలు - రెండు


నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత


తయారీ విధానం 


ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు గడ్డలుగా కాకుండా క్రీమీగా అయ్యేవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిలో మైదాపిండి, బియ్యం పిండి, ఉప్మా రవ్వ, వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. అవసరాన్ని బట్టి దానిలో కాస్త నీళ్లు వేసి.. పిండి మరీ వదులుగా కాకుండా చూసుకోవాలి. నీరు మరీ ఎక్కువైతే పిండి లూజ్ అవుతుంది. దీనివల్ల నూనె కూడా ఎక్కువ పీల్చుకుంటుంది. 


ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని ఓ పదినిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కరివేపాకు, కొత్తమీరను సన్నగా తురుముకోవాలి. పదినిమిషాల తర్వాత పిండిలో ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని నీరు కూడా పిండికి కాస్త కలుస్తుంది. అందుకే నీరు వేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వంటసోడా వేయడం వల్ల పిండి కాస్త పొంగుతుంది. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడేంత నూనె వేసి.. కాగనివ్వాలి. నూనె వేడి అయ్యాక మాత్రమే మనం పిండిని వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత పిండిని చేతితో తీసుకుని ఉండలుగా వేసుకోవాలి. పిండిని వేసే ముందు చేతిని కాస్త తడి చేస్తే పునుగులు గుండ్రంగా వస్తాయి. ఇలా వేసుకున్న పునుగులను రెండు వైపులా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వీటిని వేయించుకుని తీసేయాలి. అంతే వేడి వేడి క్రిస్పీ పునుగులు రెడీ. 



ఈ పునుగులను మీరు ఎర్రకారంతో లేదా మీకు నచ్చిన చట్నీతో కలిపి లాగించవచ్చు. లేదంటే టీకి కాంబినేషన్​గా కూడా ట్రై చేయవచ్చు. వర్షం వచ్చే సమయంలో వీటిని పిల్లలకు స్నాక్స్​గా కూడా రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్​ కూడా వీటిని సింపుల్​గా రూమ్​లో వండుకోవచ్చు. ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా, సాయంత్రం స్నాక్​గా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వర్షం సమయంలో మీరు కూడా వీటిని ట్రై చేసేయండి. 


Also Read : మాన్​సూన్​ స్పెషల్ మరమరాల గారెలు.. తక్కువ టైమ్​లో చేసుకోగలిగే టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే