Millet Pongal Recipe : మీ ఉదయాన్ని ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా మిల్లెట్ పొంగల్ తినాల్సిందే. దీనిని తయారు చేయడం సులభం. ఇది మీకు కడుపు నిండుగా ఉంచి.. చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. స్ట్రిక్ట్ డైట్ చేసేవాళ్లు హెల్తీగా రూల్స్ బ్రేక్ చేయాలనుకుంటే ఈ పొంగల్ మంచి ఎంపిక. ఎందుకంటే ఇది మీకు రుచిని అందిస్తూ.. హెల్తీగా ఉంచుతుంది.
మధుమేహ సమస్యలున్నవారు కూడా దీనిని హాయిగా తినేయొచ్చు. దీనిలో ఉపయోగించే పెసరపప్పులో ప్రోటీన్, ఇతర పోషకాలు నిండి ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యం. మిల్లెట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని తగ్గిస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉండి.. మీ ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. కాబట్టి పిల్లలు నుంచి పెద్దవరకు ఎవరైనా దీనిని హ్యాపీగా తినొచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మిల్లెట్స్ - అరకప్పు
పెసరపప్పు - అరకప్పు
నీళ్లు - నాలుగు కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
అల్లం - తరిగినది 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
జీడిపప్పు - 10
ఇంగువ - చిటికెడు
తాళింపు కోసం..
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
జీడిపప్పు - 5
తయారీ విధానం
మిల్లెట్స్‌ను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. పెసరపప్పును మీరు పొంగల్ చేసుకునే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టండి. దానిలో నూనె వేయండి. అది వేడెక్కిన తర్వాత దానిలో జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. అనంతరం ఇంగువ, కరివేపాకు, అల్లం వేయాలి. జీడిపప్పు కూడా వేసి అది లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు దానిలో నానబెట్టిన మిల్లిట్స్, పెసరపప్పును వేయాలి. అవి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని పచ్చివాసన పోతుంది. అనంతరం నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి బాగా తిప్పి.. మూత వేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆపేయాలి.
ప్రెజర్ అంతా పోయాక.. కుక్కర్ మూత తీసి పొంగల్‌ను బాగా కలపండి. తాళింపు కోసం చిన్న ఫ్రై పాన్ తీసుకుని దానిని స్టవ్‌పై పెట్టి చిన్న మంటమీద ఉంచండి. ఇప్పుడు దానిలో నూనె వేసి.. జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పులను వేసి వేయించండి. పొంగల్‌లో ఇది వేసి బాగా కలపండి. అంతే మిల్లెట్స్ పొంగల్ రెడీ. దీనిని మీరు చట్నీతో, ఆవకాయతో, సాంబర్తో కూడా తినొచ్చు.
Also Read : రవ్వతో ఊతప్పం.. కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.