Ravva Utappam Recipe : ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​ కోసం ఒక్కోరోజు ప్లాన్​తో ఉంటాం. మరోసారి అస్సలు ఏమి ప్లాన్ చేసుకోము. అలా ప్లాన్ చేసుకోని రోజే కొన్ని తినాలని మనసు కోరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దోశకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో.. ఊతప్పాన్ని కూడా దాదాపు అంతమంది ఇష్టపడతారు. మీరు కూడా ఊతప్పం ఫ్యాన్ అయితే మీరు మీ రోజులో ఓ పది 15 నిముషాలు కేటాయిస్తే చాలు. వేడి వేడి ఊతప్పాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని తినొచ్చు. 


ఊతప్పాన్ని తయారు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారేమో. అస్సలు కాదండీ. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లో రెగ్యూలర్​గా ఉండే పదార్థాలతోనే ఈ టేస్టీ ఉతప్పాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఊతప్పం తయారీలో ఎక్కువ వెజిటేబుల్ ఉపయోగిస్తాము కాబట్టి.. టేస్ట్​తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


రవ్వ - 1 కప్పు


పెరుగు - 2 టేబుల్ స్పూన్లు


అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్


ఉప్పు - తగినంత


కరివేపాకు - 1 రెబ్బ


పచ్చిమిర్చి - 1 చిన్నగా తరగాలి


క్యారెట్ - పావు కప్పు (తురిమినది)


క్యాప్సికమ్ - పావు కప్పు (సన్నగా తరగాలి)


టొమాటో - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి)


ఉల్లిపాయ - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి)


తయారీ విధానం


ముందుగా గిన్నె తీసుకుని దానిలో రవ్వ వేయండి. దానిలో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్​లో వేసి పేస్ట్ చేయాలి. దానిలో కాస్త నీరు పోసి మిక్సీ వేయాలి. దోశల పిండి మాదిరిగా వచ్చేలా కాకుండా కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. దీనిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. పది నిమిషాల తర్వాత దానిలో ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. 


ఇప్పుడు తాలింపు వేసేందుకు చిన్న ఫ్రై పాన్ తీసుకుని దానిలో నూనె పోసి అది వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. అది వేగిన వెంటనే స్టవ్ ఆపేసి.. చల్లారే వరకు ఉంచి.. దానిని ముందుగా రెడీ చేసుకున్న ఉతప్పం మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దీనిని ఓ రెండు నిమిషాలు పక్కన పెట్టి.. ఇప్పుడు దోశ పాన్ లేదా నాన్ స్టిక్ తవా తీసుకోవాలి. స్టవ్ వెలిగించి.. మీడియం మంట మీద పాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అప్లై చేసి.. ఉతప్పం పిండిని వేయాలి. ఇప్పుడు మంటను సిమ్​లో ఉంచి.. నాలుగు నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. ఉతప్పం గోధుమరంగులోకి మారిన తర్వాత దానిని తిప్పి మరోవైపు ఉడికించుకోవాలి. రెండు వైపులా వేగిందంటే ఉతప్పం రెడీ. దీనిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా లాగించేయవచ్చు. 


Also Read : హెల్తీ, టేస్టీ సగ్గుబియ్యం వడలు.. క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి..


గమనిక:పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.