Dussehra 2024 Day 7 Special Daddojanam Recipe : దేవి నవరాత్రుల్లో (Devi Navaratrulu 2024) అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు. ఏడో రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. విజ్ఞానం, సంగీతం, కళలకు దేవతగా అమ్మవారిని కొలుస్తారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారికి పలు రకాల ప్రసాదాలు అందిస్తారు. వాటిలో దద్దోజనం ఒకటి. ఇదే కాకుండా తెలుపురంగునకు ఆరోజు ప్రత్యేకతనిచ్చి.. దానికి తగ్గట్లు ప్రసాదాలు చేస్తారు. ఇంతకీ దద్దోజనంతో పాటు చేసే వంటలు ఏంటి? అమ్మవారికి ఏడోరోజు ఏమి నైవేద్యంగా సమర్పిస్తే బాగుంటుందో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
పాలు - ఒకటిన్నర కప్పులు
పెరుగు - రెండు కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
తాళింపు కోసం
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిశెనగ పప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
అల్లం తురుము - రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి - 4
ఎండు మిర్చి - 2
కరివేపాకు - ఒక రెబ్బ
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని కుక్కర్లోకి తీసుకుని కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల నీళ్లు కొలత వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి దానిని స్టౌవ్‌పై ఉంచాలి. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఈలోపు స్టౌవ్ వెలిగించి గిన్నెలో పాలు పోసి కాగనివ్వాలి. రైస్ కుక్కర్ నుంచి మూడు విజిల్స్ వస్తే.. మూత తీసేసి.. గరిటతో కలపాలి.
దద్దోజనంలో అన్నం పలుకులుగా కాకుండా మెత్తగా ఉంటేనే రుచి బాగుంటుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడు అన్నాన్ని గరిటతో కలపాలి. ఇలా కలిపిన అన్నంలో కాచిన పాలు వేసి మరోసారి కలపాలి. అయితే ఒకేసారి పాలు వేయడం కాకుండా.. కొద్ది కొద్దిగా వేస్తూ అన్నం ముద్దులుగా కాకుండా కలపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు ఫ్రెష్ది అయితేనే దద్దోజనం బాగుంటుంది. పులిసిన వాసన రాదు. దానిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై చిన్నకడాయి పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి.. పచ్చిశెనగపప్పు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చివర్లో ఇంగువ, కరివేపాకు వేసి తాళింపును సిద్ధం చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగు అన్నంలో ఈ తాళింపును వేసి కలిపేయాలి. అంతే టేస్టీ టేస్టీ దద్దోజనం రెడీ.
అయితే నవరాత్రుల్లో దద్దోజనంతో పాటు.. అటుకులు బెల్లం కలిపి కూడా స్వీట్ పెడతారు. దానిలో శనగపప్పు, కొబ్బరి ముక్కలు వేసి.. అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ నైవేద్యాలను సర్వసతీ దేవి వలె స్వచ్ఛతకు ప్రతీకగా చెప్తారు. అందుకే అమ్మవారు సరస్వతి దేవి రూపంలో ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండే ప్రసాదాలనే వండి అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు.
Also Read : అమ్మవారికి ఆరో రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. దసరా స్పెషల్ పూర్ణం బూరెలు రెసిపీ