Ramzan Special Sweet Recipes : రంజాన్ (ఈద్ అల్ ఫితర్) సమయంలో చాలామంది తమకో ముస్లిం ఫ్రెండ్ ఉండాలి అనుకుంటారు. ముఖ్యంగా ముస్లింలు చేసే షీర్ ఖుర్మా, బిర్యానీ టేస్ట్ చూసిన వారైతే.. కచ్చితంగా తమకు ఫ్రెండ్ లేదా తెలిసిన వాళ్లు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ముస్లిం ఫ్రెండ్ ఉంటే.. బిర్యానీ, స్వీట్ పంపమని మొహమాటం లేకుండా చెప్పేస్తారు. వారు చేసే ఈ టేస్టీ రెసిపీలను అందరూ చేసుకోవచ్చు. ముఖ్యంగా షీర్ ఖుర్మా చేయడం రానివారు కూడా సింపుల్​గా రంజాన్ రోజు ఈ టేస్టీ రెసిపీని చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ ట్రెడీషనల్ స్వీట్​ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చుద్దాం. 


కావాల్సిన పదార్థాలు


మిల్క్ మెయిడ్ - 50 గ్రామలు


నెయ్యి - 75 గ్రాములు 


టోన్డ్ మిల్క్ - 750 మి.లీ


సేమ్యాలు - 50 గ్రాములు


ఖర్జూరాలు - 5


బాదం - 10 


జీడిపప్పు - 10


పిస్తా - 10


చిరోంజి - 2 టేబుల్ స్పూన్లు


పుచ్చకాయ గింజలు - 1 టేబుల్ స్పూన్


ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు


తయారీ విధానం


ముందుగా ఖర్జూరాల్లోని సీడ్స్ తీసి పెట్టుకోవాలి. బాదంను పలుకులను సన్నగా తురిమి పెట్టుకోవాలి. స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. అది వేడైన తర్వాత దానిలో రెండు టేబుల్​స్పూన్ల నెయ్యి వేయాలి. అది కరిగిన తర్వాత దానిలో సేమ్యాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వీటిని సన్నని మంటమీదనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. అయితే మీరు దీనిని స్టౌవ్​ మీద ఉంచి.. పక్కకు వెళ్తే అవి మాడిపోయే అవకాశముంటుంది. కాబట్టి వాటిని వేయించేప్పుడు స్టౌవ్ దగ్గరే ఉండాలని గుర్తించుకోండి. లేదంటే మాడిపోతాయి. అనంతరం స్టౌవ్ ఆపి.. సేమ్యాలను ఓ గిన్నెలో వేసుకోవాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయిపెట్టుకుని దానిలో పాలు వేయాలి. సన్నని మంట మీద పాలను మరగనివ్వాలి. పాలు అడుగుపట్ట కుండా వాటిని నిరంతరం కలుపుతూ ఉండాలి. మరిగిన పాలల్లో సేమ్యాలు వేసి ఉడికించండి. మంటను ఎక్కువగా పెడితే  పాలు త్వరగా మరిగిపోయి.. సేమ్యాలు ఉడకవు. కాబట్టి వాటిని సన్నని మంట మీదనే ఉడికించాలి. అప్పుడే సేమ్యాలు మెత్తగా ఉడుకుతాయి. సేమ్యాలు ఉడికిన తర్వాత దానిలో మిల్క్​ మెయిడ్ వేయాలి. అనంతరం డేట్స్ కూడా వేసి బాగా కలపాలి. పాలు చిక్కగా మారేవరకు కలిపి.. దానిని సర్వింగ్ బౌల్​లోకి మార్చాలి.


ఇప్పుడు చిన్న కడాయి తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాదం పలుకులు, నెయ్యి, పిస్తాలు, చిరోంజి, పుచ్చకాయ గింజలు వేసి వేయించాలి. అయితే వీటిని సన్నని మంటమీదనే వేడి చేయాలి. అప్పుడే లోపల కూడా బాగా ఫ్రై అయి.. మంచి రుచి వస్తుంది.  అవి బ్రౌన్​ కలర్ వచ్చేవరకు వేయించాలి. అప్పుడు దానిలో ఎండుద్రాక్షలు వేసి ఫ్రై చేయాలి. వీటిని సేమ్యా మిక్స్ వేసి వేయాలి. అంతే వేడి వేడి షీర్ కూర్మా రెడీ. దీనిని వేడిగా ఉన్నప్పుడే తిన్నా.. చల్లారిన తర్వాత తిన్నా రుచిగానే ఉంటుంది. షీర్​ కూర్మాను మీరు పలుచగా తినాలి అనుకుంటే వడ్డించుకునేప్పుడు పాలు వేసి కలుపుకోవాలి. 


Also Read : రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ.. టేస్టీగా అరోమాతో రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి