Ramzan Specail Mutton Dum Biryani Recipe : ముస్లింలు చేసుకునే అత్యంత ప్రధాన పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ సమయంలో వారు వండుకునే పదార్థాలు అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా వారు చేసే బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు. అయితే రంజాన్ సమయంలో మీరు కూడా ముస్లింల స్టైల్లో మంచిగా అరోమేటిక్గా, టేస్టీగా చేసుకోవాలనుకుంటే మీరు ఈ రెసిపీని ఫాలో అవ్వొచ్చు. ఈ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? తయారీ విధానం ఏంటి? ఏ టిప్స్ ఫాలో అయితే మటన్ బిర్యానీ టేస్టీగా వస్తాదో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు - పావు కిలో
నూనె - అరకప్పు
మటన్ మ్యారినేషన్ కోసం..
మటన్ - 1 కిలో
పచ్చి బొప్పాయి తొక్క - పావు కప్పు
పచ్చిమిర్చి - 4
జాజికాయ పొడి - అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
మీడియం సైజ్ ఉల్లిపాయలు - 3
ఉప్పు - రుచికి తగినంత
ధనియాల పొడి - 2 స్పూన్స్
జీలకర్ర పొడి - 2 టీస్పూన్
కారం - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - పావు టీ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
లవంగాలు - 7
దాల్చిన చెక్క - 2 అంగుళాలు
బిర్యానీ ఆకులు - 2
యాలకులు - 5
నిమ్మకాయ రసం - 2 టీస్పూన్లు
నెయ్యి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
పెరుగు - 250 మి.లీ
కుంకుమపువ్వు పాలు - 1టేబుల్ స్పూన్
పుదీనా - చిన్న కట్ట
కొత్తిమీర - చిన్న కట్ట
బియ్యం ఉడకబెట్టేందుకు
నీరు - 3 లీటర్లు
యాలకులు - 5
లవంగాలు - 10
యాలకులు - 4
దాల్చిన చెక్క - 2 అంగుళాలు
జీలకర్రం - 1 టేబుల్ స్పూన్
స్టార్ పువ్వు - 2
పుదీనా - కట్ట
కొత్తిమీర - చిన్న కట్ట
నిమ్మరసం - కొద్దిగా
జాపత్రి - కొద్దిగా
బిర్యానీ ఆకులు - 3
ఉప్పు - రుచికి తగినంత
బాస్మతి రైస్ - అరకిలో
తయారీ విధానం
ముందుగా బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు వేసి డీప్‌గా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ నూనెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో పచ్చిబొప్పాయి తొక్కను, పచ్చిమిర్చి, అర టీస్పూన్ జాజికాయపొడి, కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటిగా ఉండే పెద్ద బిర్యానీ గిన్నె తీసుకోండి. దీనిలో మీడియం సైజ్‌లో కట్ చేయించుకున్న మటన్ వేసుకోవాలి. మీరు తీసుకునే మటన్ ఎప్పుడూ లేతగా, మంచిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బిర్యానీ బాగా వస్తుంది. ఇప్పుడు మటన్‌ను మ్యారినేట్ చేసుకోవాలి.
మటన్‌లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిబొప్పాయి పేస్ట్, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, టేబుల్ స్పూన్ గరం మసాలా, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, మరాఠీ మొగ్గలు.. ముందుగా ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెను వేసుకోవాలి. ఇవన్నీ వేసి.. మటన్‌లో మిక్స్ అయ్యేలా వీటిని బాగా కలపాలి. ఇలా కలిపిన మిక్స్‌లో నిమ్మరసం, నెయ్యి, సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో పెరుగు కూడా వేసి మరోసారి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. దీనిని ఎంత బాగా కలిపితే అంత మంచిగా మటన్‌కు మసాలా అందుతుంది. కుంకుమ పువ్వు నీరు వేసి బాగా కలిపిన మటన్‌ను మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. రాత్రంతా మేరినేట్ చేసిన కూడా మంచిది.
బిర్యానీ చేసే ఓ అరగంట ముందు బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. అనంతరం స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నీరు వేసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క,షాజీర, అనాస పువ్వులు, జాపత్రి, బిర్యానీ ఆకులు వేయాలి. మసాలాలు బాగా మరిగిన తర్వాత దానిలోని ఓ చిన్న గ్లాస్ నీటిని తీసుకుని.. దానిని మటన్ మేరినేషన్లో వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ చేసినప్పుడు కింద అడుగు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మటన్ తొందరగా ఉండుకుతుంది.
బిర్యానీ గిన్నె అంచులకు ఉన్న మసాలాను తుడిచేయండి. లేదంటే అడుగు పట్టే అవకాశాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో నానబెట్టిన బియ్యం వేయండి. కాస్త పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి సగం ఉడకనివ్వాలి. దానిలోని సగం రైస్ తీసుకుని.. బిర్యానీ గిన్నెలోని మటన్ మీద లేయర్‌గా వేయాలి. ఇప్పుడు మిగిలిన సగాన్ని మరికొంత ఉడికించి.. ముందు వేసిన రైస్ మీద లేయర్‌గా వేయాలి. రైస్‌ను నొక్కితే బిర్యానీ సరిగ్గా రాదు. అందుకే వాటిని లేయర్‌గా వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై దోశ పెనం పెట్టండి. అది వేడి అయ్యాక.. బిర్యానీ గిన్నెను పెట్టండి. మంటను తగ్గించి సిమ్‌లో ఉంచి.. బిర్యానీ గిన్నెలో రైస్‌పై కొత్తిమీరు, పుదీనా తురుము, ఫ్రై చేసిన ఆనియన్స్ వేయాలి.
చివరిగా దానిపై కుంకుమ పువ్వు నీరు, నెయ్యి, రైస్‌ని ఉండికించగా మిగిలిన నీరు అంచుల వెంట వేయండి. పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె అంచుల వెంబడి తడిని చేసి.. కలిపి పెట్టుకున్న పిండిని చుట్టూ అతికించండి. దానిపై మూతపెట్టి.. ఆపైన బరువును ఉంచండి. ఇప్పుడు స్టౌవ్ మంటని హైలో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత గిన్నె నుంచి స్టీమ్ బయటకు వస్తుంది. అలా వచ్చిన వెంటనే స్టౌవ్‌ని సిమ్‌లో ఉంచి.. మరో 20 నిమిషాలు ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి దానిని మరో 20 నిమిషాలు అలానే ఉంచేయాలి. దీనివల్ల బిర్యానీ ముద్దగా కాకుండా పొడిపొడిలాడుతూ.. మసాలాలు అన్ని మంచి అరోమానిస్తూ.. టేస్టీ బిర్యానీ మీ ముందు ఉంటుంది. రంజాన్ స్పెషల్‌గా చేసుకోవాలంటే మీరు దీనిని ఫాలో అవ్వొచ్చు.
Also Read : అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే అవిసెగింజల కారంపొడి.. ఇలా చేస్తే రెండునెలలు నిల్వ ఉంటుంది