Flaxseeds Powder aka Avisaginjala Karam Podi : అవిసెగింజలు జుట్టు పెరుగుదలకు, స్కిన్ కేర్‌కు బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, న్యూట్రిషియన్లు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అలా వీటిని నేరుగా తినాలన్నా కూడా టైమ్ లేదు అది ఇది అనుకుంటాము. కానీ దీనిని రెగ్యూలర్‌గా తీసుకోవాలనుకుంటే అవిసె గింజలతో టేస్టీ కారం పొడి చేసుకోవచ్చు. ఇది మీకు మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో? రెగ్యూలర్‌గా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఫ్లాక్స్ సీడ్స్ - అరకప్పు
ఎండు మిర్చి - 20
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 8 రెబ్బలు
నూనె - 2 స్పూన్లు
చింతపండు - నిమ్మకాయ సైజ్‌లో ఉండాలి
ఉప్పు - రుచికి తగినట్లు
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో టీస్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో అవిసె గింజలు వేయండి. వీటిని లో ఫ్లేమ్‌లో ఉంచి వేగనివ్వండి. ఇలా చిన్నమంట మీద వేయించడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ.. ఇలా చేయడం వల్ల అవిసెగింజల లోపలి కూడా మంచిగా ఉడికి ఫ్రై అవుతుంది. మంట ఎక్కువ అయితే పైపైన వేగి.. లోపల వేగేలోపు మాడిపోతాయి. లో ఫ్లేమ్ మీద వేపినప్పుడు.. అవి వేగే సమయానికి మంచి అరోమా వస్తుంది. అప్పుడు మీరు వాటిని మంటమీద నుంచి తీసేయొచ్చు.
వేగిన అవిసెగింజలను పక్కన పెట్టి అదే కడాయిని మళ్లీ స్టౌవ్‌పై పెట్టండి. దానిలో మరో టీస్పూన్ నూనె వేసి వేడిచేయండి. దానిలో పచ్చిశనగపప్పు వేయండి. అవి సగం ఉడికిన తర్వాత మినపప్పు వేసి ఫ్రై చేయండి. పొట్టు మినపప్పు వేసుకుంటే మంచి అరోమా, రుచి వస్తుంది. పప్పు వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు జీలకర్ర, ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుని వాటిని స్టౌవ్ ఆపేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
రెండు నెలలు నిల్వ ఉంటుంది..
అదే కడాయిలో ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి.. ఎండుమిర్చి రంగు మారేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి వెల్లుల్లిని పక్కకు తీసిపెట్టుకోండి. పప్పులు, ఎండుమిర్చి, అవిసెగింజలు చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దానిలో చింతపండు.. అవిసెగింజలు, ఎండుమిర్చి, పప్పులు, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. చివరిలో వెల్లుల్లి వేసి వాటిని ఓ సారి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇడ్లీలు, దోశలలోకి కావాలనుకుంటే మీరు దానిని కాస్త బరకగా చేసుకోవచ్చు. అన్నంలోకి, ఫ్రైలలోకి కావాలనుకుంటే మెత్తని పౌడర్‌గా చేసుకోవచ్చు. అంతే అవిసెగింజల కారంపొడి రెడీ. ఇది మీకు మంచి టేస్ట్‌ని ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టుకుంటే ఇది 2 నెలలు నిల్వ ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలకై..
మధుమేహమున్నవారు కూడా దీని రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోశలు, ఉప్మాలలో దీనిని కలిపి తినవచ్చు. అన్నంలో మొదటి ముద్దను దీనితో హాయిగా లాగించేయవచ్చు. అంతేకాకుండా ఇంట్లో చేసుకునే ఫ్రైలలో మసాలగా దీనిని వేసుకోవడం వల్ల డిష్‌కి మంచి రుచి, అరోమా వస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేసి చర్మానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ పొడితో రోజుకు ఒక్క ముద్ద తిన్నా చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దీని ద్వారా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి.
Also Read : ఎలాంటి ఎఫర్ట్ లేకుండా కొంబుచా టీతో బరువు తగ్గిపోతారట.. ఈ ఫంగస్ టీపై న్యూ స్టడీ ఏమంటుందంటే