AP Volunteers : రాష్ట్రంలో వాలంటీర్‌ కేంద్రంగా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల నాయకులు అంతా వాలంటీర్లు కేంద్రంగానే రాజకీయాలను సాగిస్తున్నారు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లపైనా, పలు కీలక అంశాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఎంతో కష్టపడి పని చేశామన్న మంత్రి దర్మాన.. ఈ రెండు నెలలు మరింత కష్టపడతామన్నారు. వాలంటీర్లు ఎక్కడ ఉన్నా పార్టీ కోసం కష్టపడేవారన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు బూత్‌ కో-ఆర్డినేటర్‌గా వేయనున్నట్టు స్పష్టం చేశారు. గడిచిన ఎన్నికల్లో ఐదు వేల ఓట్లతో గెలిచామని, మళ్లీ అదే పరిస్థితి వస్తే ఒక ఓటు కూడా ఉపయోగమేనని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచుతారన్నారు. వైసీపీ 110 సీట్లతో అధికారంలోకి రానుందని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 40 ఏళ్ల జీవితంలో ఎక్కడైనా ఒక్క రూపాయి లంచం తీసుకోలేదని స్పష్టం చేసిన ధర్మాన.. లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. 


దోచుకున్నది టీడీపీ ప్రభుత్వమే


తెలుగుదేశం పార్టీ రియల్‌ ఎస్టేట్‌ పేరుతో దోచుకుందని ఆరోపించారు. అభివృద్ధి పాలన అంటూ హడావిడి చేసే టీడీపీ పాలనలో ప్రజలు అడుక్కుంటుంటే ఏం చేశారని ప్రశ్నించారు. బ్రోకర్‌ నా కొడుకులు ఐదేళ్ల ప్రభుత్వం లేకపోయేసరికి చూడలేకపోతున్నారని విమర్శించిన ధర్మాన.. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. గోడలపై బాబు వస్తే జాబ్‌ వస్తుందని చెప్పేలా రాసుకున్నారని, కానీ, గూబ పగులకొట్టేలా చేశారని విమర్శించారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా అమలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థిగా తనపై పోటీ చేస్తున్న వాళ్లు ఎవరో తనకు తెలియదన్న ధర్మాన.. మీకు తెలుసా.? అని నాయకులు, కార్యకర్తలను ప్రశ్నించారు. 


మరోసారి పోటీకి ధర్మాన 
గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, వారసుడిని ఎన్నికల బరిలో దించాలని భావించారు. అందుకు అనుగుణంగా రామ్‌ మనోహర్‌ నాయుడు ప్రజల్లో తిరుగుతూ వస్తున్నారు. కానీ, వైసీపీ అధిష్టానం అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో మళ్లీ ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజల్లోకి వెళుతూ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాకు తాను మంత్రిగా చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.