Janasena Star Campaigners: పిఠాపురం: మరో వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్లాన్ చేశారు. ఏపీ ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను  పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడులను స్టార్ క్యాంపెయినర్లుగా జనసేనాని ప్రకటించారు.


వీరితో పాటు టాలీవుడ్ నృత్య దర్శకుడు జానీ మాస్టర్, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్విరాజ్, కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీనులను స్టార్ క్యాంపెయినర్లుగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు అధికార వైఎస్సార్ సీపీకి సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూనే వస్తున్నారు. అయితే జగన్ అరాచక పాలనకు అంతం పలికి, ప్రజా పాలనను అందించేందుకు కూటమిగా ఏర్పడ్డామని టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


కాటమరాయుడి వైపే అంబటి రాయుడు
క్రికెట్ కెరీర్ తరహాలోనే అంబటి రాయుడు పాలిటికల్ జర్నీ కొనసాగుతోంది. మొదట గత ఏడాది సీఎస్కే ట్రోఫీ నెగ్గాక తెచ్చి సీఎం జగన్ ముందుపెట్టారు కప్. ఆపై సీఎస్కే ఆటగాళ్లతో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ట్రైనింగ్ ఇప్పించారు సీఎం జగన్. ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అంబటి రాయుడు ప్రకటించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని.. ఇక ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. కానీ అంతలోనే అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నారు.


వైసీపీకి రాజీనామా చేయడంతో పాలిటిక్స్ కు దూరమని అంతా అనుకున్నారు. తన రూట్ మార్చుకున్న రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. జనసేనలో చేరి అంబటి రాయుడు.. ఇటీవల సిద్ధం అని మళ్లీ ట్వీట్ పెడితే తిరిగి వైసీపీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ పవన్ తాజా ప్రకటనతో కాటమరాయుడి వైపే అంబటిరాయుడు అని స్పష్టమైంది. జనసేన స్టార్ క్యాంపెయినర్లతో అంబటి రాయుడు చోటు దక్కించుకున్నారు.